పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుక్కిటి పురాణ కథలు

195


సమానతూఁకం గల తాటాకుల మీఁదవ్రాసి శారదాదేవ్యాలయంలో అమ్మవారి యెదుట తూఁచుదాము. అందులో యేది యెక్కువ తూఁగితే ఆకవిత్వం అతిశయించినట్టు నిర్ణయమవుతుం"దని చెప్పినట్టున్నూ అందుకు భవభూతికూడా వొప్పుకున్నట్టున్నూతుదకు ఆలా తూఁచేటప్పడు భవభూతిగారిశ్లోకం వున్నవైపు తేలికగా పైకితేలిపోతూ వుండివుండడంలో అమ్మవారు స్వల్పవిషయంలో మహాకవికి, పరాభవం యెందుకు రావాలని కాఁబోలు! తనచెవు సందున అలంకారార్థం ధరించిన యెఱ్ఱకలువపూలు తాలూకో, తామరపువ్వుతాలూకో మకరందాన్ని భవభూతిశ్లోకం వున్నవైపున చిలికినట్టున్నూ దాన్ని కనిపెట్టి కాళిదాసు- శ్లో "అహో! మే సౌభాగ్యం మమచ భవభూతేశ్చ ఫణితిం ధటాయా మారోప్య ప్రతిఫలతి తస్యాం లఘిమని | గిరాం దేవీ సద్యశ్శ్రుతికలిత కల్హార కలికా ! మధూళీమాధుర్యం క్షిపతి పరిపూర్త్యె భగవతీ..” అనే శ్లోకం చెప్పి ఆ రహస్యాన్ని బయటఁ బెట్టినట్టున్నూ విద్వత్పరంపరవల్ల వినడం. ఇందులో భవభూతి పేరుకూడా వుంది కానీ యీ శ్లోకం కాళిదాసే చెప్పాఁడనడానికి ఆధారంలేదు. ఆ పద్ధతిని భవభూతికిన్నీ మఱివక కవికిన్నీ యిట్టి వివాదం తటస్థించడమున్నూ, అందులో భవభూతికి వోడురావడమున్నూ తటస్థిస్తుంది. వొక్క కాళిదాసుకు భవభూతి యే స్వల్పంగానో తీసిపోవడానికి విద్వల్లోకం అంగీకరిస్తుందికానీ మఱో కవికి తీసిపోవడానికి ఎంత మాత్రమున్నూ అంగీకరించదు. కాఁబట్టి ఆకల్పన కుదరదు. అదిన్నీ కాక, కొన్ని విషయాలలో కాళిదాసు భవభూతికి యత్కించితు తీసిపోయినప్పటికీ ఉత్తరరామ చరిత్ర రచనలో కాళి దాసుకన్నా అంటే అతని శాకుంతల రచనకంటే కూడా మిన్నగానే వున్నట్టు కాళిదాసే వప్పుకున్నట్టు యీక్రింది శ్లోకం చెపుతుంది- శ్లో "నాటకేషుచ కావ్యేషు వయంవా వయమేవవా, ఉత్తరే రామచరితే భవభూతి ర్విశిష్యతే" అంటూ యెప్పుడో సర్టిఫికట్టు యిచ్చినట్టు వినికి. ఏక కాలికులు కారు వీరనేవారు యీశ్లోకాన్ని కూడా యెవరికో అంటగట్టవలసి వస్తుంది. యింకా యెన్నో వున్నాయి. వీరిద్దఱ్ఱే కాక దండికూడా భోజుని సభలో వుండేవాఁడనడానికి సంబంధించిన కథలు. అవన్నీ భోజ చరిత్రలో యెవరో వుటంకించే వున్నారు. భోజచరిత్ర వ్రాసిన కవి యెవరో తెలియదు. మాఘకవినికూడా ఆ భోజచరిత్ర భోజుఁడి కాలంలో వున్నట్టు చెపుతుంది. కాలపరిశీలకులు ఆ భోజచరిత్రాన్ని బొత్తిగా విశ్వసింపరు. కాని కొన్ని కథలుమాత్రం ఆ పరిశీలకులకు కంఠం ముడిపట్టుకొనేవి లేకపోలేదు. కొందఱు కాళిదాసు విక్రమార్కుని సభలోవున్నట్టు నప్రమాణంగా ఋజువుచేస్తున్నారు. శాకుంతలంలో ప్రస్తావనలోవున్న- "అభిరూపభూయిష్ఠా పరిషదియమ్” అనే వాక్యాన్ని “విక్రమార్కభూయిష్ఠా" అని వున్నట్టు చెపుతూవున్నారు. కాళిదాసకృతము లనుకొనే రఘువంశ కుమార సంభవాది కావ్యాలున్నూ, శాకుంతల