పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

196

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


విక్రమోర్వశీయాది నాటకాలున్నూ రచించిన కాళిదాసులు వేఱువేఱుగా వున్నట్టున్నూ చెపుతూ వున్నారు యిప్పుడు కొందఱు పరిశీలకులు. ఆ చెప్పడంలో రఘువంశ కుమారసంభవాలు రెండున్నూ యేకకవికృతాలు కావనేవారికి వకచిక్కు వుంది. రఘువంశంలో యిందుమతీ పరిణయఘట్టంలో వున్నశ్లోకాలు, కుమారసంభవంలో పార్వతీపరిణయఘట్టంలో కొన్ని తూచా తప్పకుండా పడివున్నాయి. భిన్నకర్తృకగ్రంథా లయితే ఆలా పడడానికి సమాధానం వుండదు. అందుచేత ఆ రెండు గ్రంథాలమట్టుకేనా యేకకర్తృకత్వం వప్పుకోవాలని నేననుకుంటాను. యిద్దఱు కాళిదాసులు వున్నట్టు వ్రాసేవారికిన్నీ ఆధారాలు లేకపోలేదు. అవి ఖండించాలంటే సుఖసుఖాల తేలేపని కాదు. కాని లోకంలో వున్న ప్రతీతియందు వున్నంత మూఢవిశ్వాసం మాత్రం పరిశీలించి చేసిన సిద్ధాంతమందు లోకానికి కలగదు. అందుచేత మూఢవిశ్వాసాన్నే నేను అవలంబిస్తూ వున్నాను. యింకా కొందఱు కాళిదాసులైతే వున్నారు. కాని వారు 'అభినవ' అనేపదం పూర్వమంధు కలవా రవడంచేత అంతగాని కొంతగాని బాధించరు. "అభినవపదపూర్వః కాళిదాసః ప్రగల్భః" ఇత్యాదులు చూచుకోఁదగును. మొత్తందండి భవభూతి కాళిదాసులు, సంస్కృత కవితాప్రపంచకంలో పేరు మ్రోగిన త్రిమూర్తులు. దండి భవభూతులు కాళిదాసుకన్న ముందే భోజరాజుగారి ఆస్థానమందు వుండి యెవ్వరినిన్నీ ఆరాజుగారి ఆస్థానానికి చేరనిచ్చేవారు కారంటూ కొన్ని కథలు వున్నాయి. వాట్ల నిజానిజాలు నిర్ణయించడం చాలా దుర్ఘటం. కాళిదాసునుకూడా వీరిద్దఱున్నూ చేరనిచ్చే వారే కారనిన్నీ కాళిదాసు యేదో వెఱ్ఱిగా శ్లోకాలు చెప్పుకొంటూ వీరిని ఆశ్రయించేటప్పటికి రాజుగారికి తమయందు వుండే అపోహని తొలగించడానికి యీ కాళిదాసుని రాజుగారి ముందఱ పెట్టారనిన్నీ వకకథవుంది. ఆకథకు సంబంధించిందే యీ క్రింది శ్లోకం.

శ్లో. “అస్థివద్బకవచ్చైవ చల్లవ ద్వెల్లకుక్కవత్
     రాజతే భోజతేకీర్తిః పున స్సన్యాసిదంతవత్"

యీ శ్లోకంలో వున్న"చల్ల, వెల్లకుక్క" శబ్దాలు గౌడదేశీయుఁడైన కాళిదాసు శ్లోకంలో పడడం అసంభవం కాఁబట్టి ఆంధ్రదేశీయుల కల్పనాకథగా మనం భావించాలి. లోకంలో వక రాజును గూర్చిగాని, ఒక కవినిగూర్చి గాని మనం మాట్లాడుకోవలసివస్తే ఆ వ్యక్తులు మొట్టమొదటనుంచిన్నీ మహాయోగంలోనే వున్నట్టు చెప్పకోవడంలో వినడానికి అంత ఆదరం వుండదు, చూడండీ! విశ్వదాతగారినిగూర్చి లోకం యెంత సంతోషంగా చెప్పుకుంటూ వుంటుందోను యీయన వొకప్పుడు 0-4-0 అణాలు తనచేతులో లేక యెంతో చిక్కుపడ్డట్టు కూడా వింటే ఆయన ముఖతః విన్నానేమో? లేక మఱి వకరివల్ల