పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

194

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


అని ఆజ్ఞాపించినట్టున్నూ, ఆ బోగంపిల్ల తమలపాకులున్నూ, సున్నమున్నూ తెచ్చి కాళిదాసుగారికి ముందుగా యిచ్చి తరవాత దండిగారికి సున్నాన్ని తెచ్చి యిచ్చిందనిన్నీ ఆపట్లాన్ని దండి "నేను ముందుగా నిన్ను సున్నం తెమ్మన్నానుకదా, నాకు ముందుగా సున్నాన్ని' యివ్వక కాళిదాసుగారికి తమలపాకులు ముందుగా యిచ్చి నాకు తరువాత సున్నాన్ని యివ్వడానికి కారణమేమిటి?" అని విలాసంగా అడిగేటప్పటికి ఆ పిల్ల- “అయ్యా మేము వేశ్యలం, మాకు వకఅణా యెవరెక్కువిస్తే వారిని ముందుగా గౌరవిస్తాం. కాళిదాసుగారు అయిదు అణాలు యిచ్చారు. మీరు మూఁడు అణాలే యిచ్చా"రని జవాబు చెప్పిందనిన్నీ దానితో దండి దాని తెల్వితేటలకు సంతోషించి వూరుకున్నాఁడనిన్నీ వకకథ విద్వత్పరంపర చెప్పగా వినడం. ణకారాన్ని “అణా" అని చిన్నప్పుడు కుఱ్ఱాళ్లకు అక్షరాలు చెప్పేటప్పుడు మన తెలుఁగు దేశంలో పలకడంవుంది. యీ పలుకుబడి యితరదేశాలలోకూడా వుంటే వందేమో కాని 'అణా' అనేది నాల్గుడబ్బుల పరిమాణం కల ద్రవ్యాన్ని చెప్పడం వుండివుండదు. కాఁబట్టి యీకథకూడా ఆంధ్రదేశంలో పుట్టినకథే అనుకోవాలి. కథ కల్పితమే అయినప్పటికీ అప్పటికాలంలో వేశ్యలుకూడా సంస్కృతంలో మంచి ప్రవేశం కలవాళ్లనే అంశమేకాకుండా కాళిదాసుగారితోపాటు దండిమహాకవి కూడా అంతో యింతో విలాస పురుషుఁడే అనే అంశం దీనివల్ల ధ్వనితం అవుతుంది. పైఁగా దండికన్నా కాళిదాసే అధికుఁడనే అంశం తాత్కాలికలుగావుండే బోగంకన్యకలకు కూడా తెలిసినదే అనికూడా ధ్వనిత మని తెలిసికోవలసి వుంటుంది. ఎన్నోకథలు కాళిదాసున్నూ, దండిన్నీ భవభూతిన్నీ వకటేకాలంవాళ్లన్నట్టు చెప్పుకొనేవే వున్నాయి. అందులో కొన్నిటిని తోసేయడం మఱీ చిక్కుగా వుంటుంది. చూడండీ యీ కింద వుదాహరించే కథలు-శ్లో కవి ర్దండీ కవి ర్దండీ కవిర్దండీ నసంశయః" అని కాళీమహాదేవి కాళిదాసుతో అన్నట్టున్నూ దానిమీఁద కాళిదాసుకి కోపంవచ్చి “వొళ్లెఱుగనిశివం"గా అమ్మవారిని వుద్దేశించి, "కో౽హం రండే!’ అని అడిగినట్టున్నూ, దానిమీఁద అమ్మవారు తన పొరపాటును సవరించు కోవడానికి దయతో- "త్వమేవా౽హం త్వమేవా౽హం త్వమేవా౽హం న సంశయః’ అని జవాబు చెప్పినట్టున్నూ వినడం. యేక కాలికత్వం దండికాళిదాసుల కుండకపోతే యీకథ కుదరదు. లేదా? కాళిదాసుకంటే దండి పూర్వుఁడేనా అయివుంటే కొంత సమన్వయం అవుతుంది. మఱిన్నీ భోజరాజుగారు ఉపరిసురతాన్ని కాళిదాస భవభూతు లిద్దఱికీ వర్ణ్యంగా యేర్పఱిచి ప్రశ్నించినప్పుడు చెఱివకశ్లోకం చెప్పడమున్నూ అందులో కాళిదాసుగారిశ్లోకమే మెఱుఁగుగా వున్నట్టు ఒకవిశేషణంవల్ల భోజరాజుగారు అభిప్రాయపడేటప్పటికి భవభూతి తనదే బాగా వుందని వృథా వివాదకు వుపక్రమించడం తోనే కాళిదాసు "మనకీ వివాద మెందుకు? మనమన శ్లోకాలు