పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిఠాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు

23

అప్పటికాలానికీ యిప్పటికాలానికీ వ్యత్యాసం

యీగాథ యావతూ మావీథినే మాయింటికి సుమారు 60, 70 గజాలలో వుండే వైఖానసుల గృహంలోనే జరిగింది కాని, నాకు బొత్తిగా చిన్నతన మవడంచేత యితరులవల్ల విని వ్రాయడమే అయింది. కాని స్వయంగాచూచి వ్రాసిందిమాత్రంకాదు. అయితే ఆ వయస్సులో జరిగినవి కూడా కొన్ని యిప్పటికిన్నీ జ్ఞాపకంవున్నాయి. శ్రీ రాజావారు మా గ్రామం దయచేసినప్పడు ఏవీథిని వెడతారో ఆ వీథినివున్న యిండ్లల్లో వుండే ముత్తైదువులు మంగళహారతు లివ్వడం వండేది. ఆలా హారతిపట్టిన పళ్లేలలో యేదో రూపాయికి తగ్గకుండా ఆ రాజావారు వేయించడం వుండేది. యిది జ్ఞాపకం వుందిగాని మణికొన్ని జ్ఞాపకం లేవు. యిప్పటికీ అప్పటికీ చాలా వ్యత్యాసం. యేవిషయంచూతామన్నా వ్యత్యాసమే. యిప్పటి జమీందార్లు యెవరినేనా ధనికుండుగా వుండేవాణ్ణి మన్ననగా పిలుస్తారు పిలవవలసివస్తే. అప్పుడో కోటీశ్వరుణ్ణినాసరే, వర్ణాశ్రమాచార పద్ధతినితప్ప, జమీందార్లేకాదు, రాజబంధువులే కాదు, రాజోద్యోగులే కాదు పిల్చేవారేకారు, ఆ ధనాఢ్యులేనా యే సందర్భంలోనో జమీందార్లు తన్ను పిల్చి మాట్లాడేండంటేనే సంతోషించేవారు. అంతేనేకాని యేమండీ అన్నారుకారని విచారించినట్లే లేదు. యీ సందర్భం నేను కాకినాడలో వక షాహుకారు సందర్భంలో చూచాను. శ్రీ చెలికాని జగన్నాథరాయణింగారు రాజబంధువులు గాని రాజులుకారు. వీరు మా రాజావారి ఆఖరు మామగారు, అనగా యేడోభార్య తండ్రి అన్నమాట. యింకా కొన్ని చుట్టటికాలు వుంటే వుంటా యనుకొందాం, అప్పటికి అమల్లోవున్న చుట్టణికం అది. యీయన వక పెద్ద షాహుకారుని నీవు అని యేకవచనంగా మాట్లాడడం నేను స్వయంగా విన్నదే. అసలు మా రాజావారు యీ షాహుకారు కంటేనేకాదు, యీ దేశంలోవున్నయే షాహుకారుకంటే కూడా చాలా గొప్పగా వుండి పేరుప్రతిష్టలు గడించిన షాహుకారినే నువ్వనే వారని విన్నాను. ఆ జమీందార్లకాలంవేరు, యీ జమీందార్ల కాలం వేఱు. వీరు యించుమించు సామాన్యప్రజలుగానే మాటిపోవలసివచ్చింది. యీ గవర్నమెంటు ప్రభుత్వంలో కాCబట్టి యిప్పటి దృష్టితో అప్పటి జమీందార్ల చర్యలుగాని అప్పటి దృష్టితో యిప్పటి జమీందార్ల చర్యలుగాని మనం ముచ్చటించుకొంటే "యేతంపెట్టు" గా వుంటుంది గాని లేశమున్నూ సరిపడదు.

కొన్ని చోట్ల శాస్త్రమర్యాదను పూర్తిగా అతిక్రమించిన గౌరవాలున్నూ వుండడం చూచాను. యానాంలో దేవాలయంలో తీర్ధప్రసాదాలు శూద్రులకిచ్చాక కోమట్లకిచ్చేమర్యాద యెన్నాళ్లనుంచో వుంది, బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్రులుకాని బ్రహ్మక్షత్రియశూద్రవైశ్యులు కాదుగదా? యిది బలాబలాలనిపట్టి జరిగేమర్యాద. దెబ్బకు దెయ్యం జంకుతుంది కదా?