పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

180

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


తప్పున్నూకాదు. యెవరేనా వకకార్యాన్ని పూనుకొని నిర్వహించేటప్పుడు ఆ నిర్వహణంలో “ఆవగింజలో అఱపాలు” గూడా కాకుండావున్నా చాలావఱకు జరిగిందనే నమ్మికవుంటేనే కాని దానిలోవారు పనిచేయడానికి సాహసోత్సాహాలుకలగవు. వెనకయెవరో బ్రాహ్మఁడు పరమామాయికుఁడు సముద్రం దోసిళ్లతో తోడుతూవుండడమూ, ఆలా పది పదిహేను రోజులు జరిగాక "యేమాత్రం సముద్రం తరిగిందని ప్రశ్నరావడమూ, ఆ ప్రశ్నకు జవాబుగా ఆ పిచ్చిబ్రాహ్మఁడు "నూటికి తొంభైతొమ్మిదివంతులు తరిగింది. రేపోనేఁడో పూర్తిగా సముద్రంవట్టిపోతుం"దని సంతోషపూర్వకంగా చెప్పడమూ అన్యత్రా వ్రాసే వున్నాను. ఆమె యొక్క విశ్వాసానికిన్నీ ఉద్యమానికిన్నీ నా వ్యాసంలో భంగించేమాట వక్కటికూడా లేదు. కళలకోసం యిప్పుడున్న వేశ్యలే వుండి తీరాలనే అభిప్రాయాన్ని నేను నా వ్యాసంలో యెక్కడా వెల్లడించలేదు. యేజాతిలోన్నుంచేనాసరే కొందఱు వుండవలసి వస్తుందని మాత్రం అభిప్రాయం సూచించాను. కాని, "కళలు అంతరిస్తాయి కనక వారుగాని మరొక జాతివారుగాని వాట్లను సంరక్షించడానికి కొంత దుర్నీతితో సంబంధించిన దేవదాసీత్వాన్ని లేక వేశ్యాత్వాన్ని స్వీకరిస్తే గాని వల్లకాదని గవర్నమెంటు ద్వారాగా బిల్లు చేయించవలసి వుంటుంది గనక అందుకోసమై గవర్నమెంటులో పలుకుబడి కలవారికి విన్నపమంపుకోవలసిం"దనియే సంఘాన్నీ నేను పురికొల్పలేదు. యిట్టిస్థితిలో ఆమెకు నామీఁద ఆగ్రహమెందుకో? నా వ్యాసం “వుపసంహరించుకోవలసిం"దని శాసించడం ఎందుకో? అగమ్య గోచరంగా వుంది. ప్రతివృత్తిలోనూ మంచిచెడ్డలు రెండూ మిళితమై వుంటాయి. విధిలేక - పాలకోసం రాయిమోసినట్టు ఆమంచికోసం చెడ్డనుకూడా ఆమోదించవలసి వస్తుంది. దీన్నే "ధాన్యపలాల న్యాయం" అంటారు. ప్రపంచకంలో వేయింటికి యేవొక్క వ్యక్తికో తప్ప మాంసభక్షణతో అవసరం సర్వత్రా కలిగేవుంది“మ్రానను రాతనుం గలదె? మాంసము ప్రాణులమేనఁగాక” అందుచేత గోవు మొదలుకొని అన్ని జంతువులనూ అందులో ముఖ్యంగా అందఱికీ పనికివచ్చే మేఁకలనూ, ఆ గొఱ్ఱెలనూ వధించవలసివుంది. ఆయీ జంతువులకు (సోల్) ఆత్మ లేదని చెప్పే పాశ్చాత్యులకెంత కరుణ వుందో? వాట్ల యందు మనలో లాగే ఆత్మ వుందని అంగీకరించక తప్పదు. యిట్టి నిష్కరుణత్వం సహింపలేకో మాంసభక్షణం రుచింపకో యెందఱో ఆ వంశాలకు సంబంధించినవారు పూర్తిగా శాకాహారులుగా మారివున్నారు. వారిని – “మీరు మాంసభక్షణం చేస్తేనే కాని వల్లకా"దని యెవరూ నిర్బంధించినట్టులేదు. ఆలాగే వేశ్యాత్వాన్ని గూర్చిన్నీ నిర్బంధించేవాళ్లంటూ వుండరు; ప్రోత్సహించేవాళ్లున్నూ వుండరు. యిక్కడ వ్రాయవలసిన ప్రధానంమాట వ్రాయనేలేదు. ఆ జంతువధ వక్కరోజున ఆవ్యాపారస్థులు సమ్మెకట్టి చేయకపోతే యెందఱో వుపవాసము చేయవలసివస్తుంది. కాని ఆవధకు