పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కళలను ప్రదర్శించే స్త్రీలు స్వతంత్రులుగా వుండాలి

181


కులక్రమాగతంగా అలవాటుపడ్డవారే తప్ప యితరులు మాంసభక్షకులే అయినా అవలంబించలేరు. అంతటి ఘోరకృత్యానికి వారుగాని, వేరొకరుగాని సిద్ధపడడం యెందుకు? లాభాపేక్షచేతే కదా? ఆ లాభాపేక్ష మాత్రం అందఱినీ ఆ పనిలోకి" దిగనిస్తుందా? ఆలాగే ప్రస్తుత విషయమున్నూ - యిందాఁకా యెందుకు? పరమపవిత్రమైన యజ్ఞంలో పశుహననం చేయడంలో ఆరితేరిన శ్రౌతిపేరు శమిత. ఆశమిత వక నరమేధంలో పశువుగా యేర్పడ్డ మనిషితండ్రే కావలసివచ్చింది. యెందుచేత? యజ్ఞానికి సమ్మతించికూడా ఆపనికి యితర శ్రౌతులు సమ్మతించారు కారు. అప్పుడు ఆ నరుణ్ణి కన్నతండ్రి – “మరికొంత ధనాన్ని యిస్తే నేనే ఆశమితృవ్యాపారాన్ని నిర్వర్తిస్తా" నన్నాడు. యింతకన్న ప్రకృతవిషయంలో యెక్కువ వ్రాయనక్కఱలేదు. అన్ని దుష్కృత్యాలూ ధనంచేయిస్తుంది.

ఉ. “దేవతలన్ యజింత్రు పర దేశములన్ జరియింత్రు దాతలై
     కోవిదకోటికిన్ ముదము గొల్పుదు రుత్తము, లల్పలోభులో?
     జీవుల హింస సేయుదురు చేయుదురెంతయుc జౌర్యమున్ దగన్
     భావనసేయఁగాఁ బరధనమ్ము హరించెడి త్రోవ లిన్నియున్."

దానికోసం పలువురు పలువృత్తులను అవలంబించారు. అందులో కొన్ని వృత్తులలో మంచికన్నా చెడ్డ తక్కువ వుంటుంది. కొన్ని వృత్తులలో చెడ్డకన్నా మంచే యెక్కువగా వుంటుంది. కొన్నిట్లో రెండూ సమంగా వుంటాయి. యావత్తుగాని, కొంతేగాని మంచితో చేరడమున్నూ చెడ్డే చేరడమున్నూ ఏ వృత్తిలోనో కాని సంఘటించదు. అట్టిస్థితిలో ఆయా వృత్తులు వారి వారి యోగ్యతానుసారం అనాదిగా అవలంబించి – “కులవృత్తికి సాటిలేదు గువ్వల చెన్నా!" అన్న గుడ్డి విశ్వాసానికి దాసులై కొందఱు అలాగే పడివున్నారు. వారివారికి భారతంలో వున్న ధర్మవ్యాధుఁడు వగయిరాల ధర్మవాక్యాలున్నూ, భగవద్గీతలోవుండే - స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః’ అనే శ్రీకృష్ణ పరమాత్మయొక్క అభిప్రాయమున్నూ ఆధారంగా కనబడుతుంది. కొత్తతోవ తొక్కేవారికో? "తాతస్యకూపో౽యమితి బ్రువాణాఃక్షారం జలం కాపురుషాః పిబంతి” అనే వాక్యం తోడ్పడుతుంది. ఆయావ్యక్తులు తమ తమ వృత్తియందుండే నైచ్యాన్ని యేవగించుకొని క్వాచిత్కంగానే అనుకుందాం, ఆవృత్తిని వదులుకోవడానికి ముఖ్యకారణంగా నాబుద్ధికి యిలా తోస్తుంది. యేవో రెండు పరీక్షలు ఆయా నీచవృత్తులలోనే వుండి సంపాదించిన ధనంతోనే తమ తమ సంతానానికి తల్లిదండ్రులు అంటేటట్టు చేస్తే తద్ద్వారాగా గౌరవ జీవనం యే కొందఱికో కలగడం చూచి యితరులు కూడా స్వవృత్తిత్యాగానికి ప్రయత్నిస్తూవున్నారు. కాని ఆలాటి