పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

150

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వారికి కావలసింది తవ్వెడో మానెడో బియ్యమూ, దానికి సరిపడ్డ పప్పూ, ఉప్పూ వగైరా అయినా పంపడం మాత్రం యే పాతిక ముఫ్పైమందికో సరిపడ్డంత పంపేవారనిన్నీ అది చూచి వారు “అయ్యా యింతపదార్థం అవసరం ఉండదు” అని త్రిప్పివేయబోతూ వుండగా కిష్టమ్మగారు "అయ్యా, మీ స్వయంపాకంలోనే యీవేళ మేంకూడా భోంచేసి పునీతులం కావడానికి మాకు అభ్యనుజ్ఞ నిప్పించాలని అతి వినయంగా (అతి వినయం ధూర్తలక్షణం) కోరేవారనిన్నీ దానికి యీ ఛాందసులు యేమీ ప్రతి చెప్పలేక, ఆహితాగ్నులు వంట బ్రాహ్మలుగా మారి భోజనానంతరం వారిచ్చే సంభావన పుచ్చుకొని జమీందారు గారి యుక్తికి ఆశ్చర్యపడుచూ వెళ్లేవారనిన్నీ చెప్పుకుంటారు. ఆయీ సంగతి యెన్నాళ్లనాటిదో కాదు గాని నాపుట్టుకకు కొంచెం పూర్వపుదై వుంటుంది. కనక యెనభైయేళ్లనాటిదై వుంటుంది. అయితే గోపాల క్రిష్ణమ్మగారు యీ విధంగా వీరిని సమ్మానమనే పేరుతో అవమానించడం యెందుకు? అనే శంక ప్రతివారికి ఉత్థితాకాంక్షగా కలుగుతుంది. ఆయన తాత్పర్యం యిది : ఆహితాగ్నులకు తగిన శుచిశుభ్రాలు లేని చోట, స్వహస్తపాకం చేసుకుంటారు సరే, మా యింట్లో యే విధమైన ఆచారలోపమూ లేదుగదా? వీరికీ తెగనీలుగెందుకు? కనక వీరికిది ప్రాయశ్చిత్తంగా పరిణమించుగాక! అని కావచ్చును. యేమేనా కిష్టమ్మగారి ఆతిధేయత్వం అభినందనీయంగాదు. దీనికి "వీరభద్రపళ్యానికి హనుమత్పళ్లెం"గా బులుసు వెంకట సోమయాజులుగారు వొకయుక్తిచేసి మృదువుగా మందలించినట్లు విన్నాను. -

యెప్పుడో దైవికంగానో, లేక ప్రత్యేకించి పనిగట్టుకొని యిందుకోసమో, వెంకప్ప సోమయాజులుగారు దయచేసేటప్పటికి యథాపూర్వంగానే సామగ్రి వెళ్లేటప్పటికి స్వయంపాకం యేలాచేస్తే ప్రస్తుతానికి అనుకూలమో, ఆలాగు "పచా మ్యన్నం చతుర్విధం"గా తయారుచేసి యింత పచ్చిపులుసుమాత్రం చేసి, కూరలు వారు పంపినా వాట్లజోలికి పోక దేవతార్చన ముగించి “అయ్యా! అభ్యవహారానికి దయచేయండి" అని జమీందారు గారిని ఆహ్వానించేటప్పటికి వారు దయచేశారు. సోమయాజులుగారు విస్తళ్లలో పదార్థం వడ్డించారు: అది సరిగా వుడకలేదు సరికదా, పైగా దాన్నిండా మసిబొగ్గులూ, మట్టిబెడ్డలూ వగైరాలతో యేలా వుండాలో, చెప్పేదేమిటి? ఆలావుండేటప్పటికి జమీందారుగారు తెల్లబోయి "యేమి?? సోమయాజులుగారూ యీలా వుంది? పొయి మండిందిగాదా? అయ్యో పాపం యీవేళ దీన్ని యేలా భోంచేస్తారు" అంటూ నిజమైన విచారం తోటే వుపచారవాక్యాలు పలికేటప్పటికి సోమయాజులుగారు యెఱిగుండిచేసిన కొంటెతనమేకనక నిర్వికారచిత్తంతో సగౌరవంగా సంబోధించి- "కాలే కడుపుకి మండేబూడిది" యిది మాకు నిత్యమూ జీతపాటే. యెప్పడోగాని మాకు యీ స్వహస్తపాకము తప్పదు. సుకుమారముగా