పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/136

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

140

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


నిరతాన్నదానం చేసేవారి యిళ్లను "తంజావూరి సత్రం" అంటూ చెప్పడం యిప్పటికిన్నీ వినబడడంచేత యిందులో కొంత కల్పనవున్నప్పటికీ కొంతేనా యథార్థం వుండకపోదని నానమ్మకం. నిజమైన సోమరులెవరో తేల్చడాన్ని గూర్చిన యితిహాసంవంటిదే నిజంగా సంగీతం విని ఆనందించడం యెట్టిదో, వూరికే తల తిప్పడం యేలాటిదో, తేల్చడానికిక్కూడా వకకథ చెప్పుకుంటారు. పనిలో పనిదాన్ని కూడా వుదహరిస్తాను. యెవరేనాసంగీతం పాడేమగవాళ్లుగాని, ఆఁడవాళ్లుగాని సభలో పాడుతూవుంటే చాలామంది ఆ పాటలోవున్న సారం బాగా తమకు తెలిసినట్టు తల వూఁపుతూ ఆ సమీపంలో కూర్చోవడంకలదు. సోమరుల విషయంలో తంజావూరు మహారాజుక్కలిగినట్టే యీ తలత్రిప్పేవారిని గూర్చి యే మహారాజుకో సంశయము కలిగి మంత్రిని ప్రశ్నించేటప్పటికి మంత్రి వకవుపాయం చేసినట్టు చెప్పుకోవడం. ఆవుపాయం యేలాటిదంటే?...

“అయ్యా! యీవేళ సంగీతసభలో యెవరున్నూతలతిప్పఁగూడదు. నిశ్చలంగా వింటే అభ్యంతరంలేదు. తలతిప్పేయెడల వారిపేళ్లు నోటుచేసుకొని తరువాత వారిని టుపాకితో కాల్చివేయడం జరుగుతుంది. కాఁబట్టి జాగర్తా!” అని ముందు చెప్పి సంగీతకచేరీ జరిగించారఁట! యిదివఱలో తలతిప్పేవారిలో నూటికి తొంభైతొమ్మండుగురు అసలు ఆ సభకు రానేలేదఁట! వచ్చిన వాళ్లల్లోకూడా అందఱూనిర్జీవ ప్రతిమలలాగే కూర్చున్నారఁట! కాని యేకొందఱో అప్పుడుకూడా తలతిప్పడంమానలేదఁట! ప్రాణం పోతుందనే భయాన్నికూడా మఱచిపోయి సహజంగా కలిగే ఆనందాన్ని వెలిపుచ్చడంవల్ల నిజంగా సంగీతరసం తెలిసినవాళ్లు వీళ్లే అనిన్నీ తక్కినవాళ్లు- “గతానుగతికో లోకోనలోకః పారమార్థికః" అనే తెగలో వాళ్లే కాని నిజంగా గానం తెలిసినవాళ్లు కారనిన్నీ నిశ్చయించుకొన్నారఁట! ప్రతివిద్యలోనూకూడా అనుకరించేజనం చాలా వుంటుంది. తత్త్వం తెలిసినవాళ్లు మిక్కిలీ తక్కువగానే వుంటారు. యీ అనుకరణాన్ని గూర్చికూడా వక యితిహాసం మఱోవిషయంలో పెద్దలవల్ల విన్నాను. దాన్నికూడా సంగ్రహంగా వ్రాస్తాను. వక బ్రాహ్మఁడు యేదో పుణ్యకాలంలో యేనదికో స్నానానికి వెళ్లాఁడఁట! స్నానం చేయడానికి నదిలోకిదిగి వచ్చేలోపున తనజారీచెంబు యొవళ్లేనా తస్కరిస్తారేమో? అనే అనుమానంచేత ఆ వొడ్డుమీఁద వుండే యిసుక పోగుచేసి వకలింగాకారంగా తనజారీ లోపలభద్రపఱిచి యేర్పఱచి స్నానానికి నదిలోకిదిగి యథాశాస్త్రంగా యావత్తున్ను నెరవేర్చుకొని వొడ్డుమీఁదకువచ్చి చూచేటప్పటికి యెక్కడ చూచినా లింగాలే కనబడ్డాయఁట! కారణమేమిటంటే? యీయన విద్వాంసుఁడయి వుండడంచేత లింగంచేసి స్నానానికి దిగడాన్ని బట్టి యీ పుణ్యకాలంలో యీలాచేయడం విధికాcబోలు ననుకొని మఱికొందఱుకూడా లింగాకారాలు నిర్మించడానికి ఆరంభించేటప్పటికి, వారిని చూచివారూ,