పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సోమరిసత్రాలు

139


నూటికి తొంభైతొమ్మండుగురు ఆ పాకలు వదలిపెట్టి వెళ్లారఁట! కాని తక్కినవాళ్లు కొందఱు ఆలాగే వుండిపోయారఁట! యేర్పఱిచిన కాలానికి సరీగా ఆ పాకలు అంటించారఁట! అంటించాక మంట కనపడ్డాక కొందఱు లేచి వెళ్లారఁట! మఱికొందఱు యింకా మనమున్న చోటికి మంటరాలేదంటూ కదలకుండా పేకో, చదరంగమో, పులిజూదమో ఆడుకుంటూ అలాగే నిలిచిపోయారఁట! కొందరు సోమరిపోతులు నిద్రపోతూ లేవనేలేదఁట! అప్పడు మంత్రి నిష్కారణంగా చచ్చిపోతారని భయపడి వాళ్లను బలవంతంగా రాజుగారి నౌకర్లచేత యీవలికి లాగించి – “అయ్యా! నిజమైన సోమరిపోతులంటే వీళ్లుమాత్రమే" అని చెప్పేటప్పటికి రాజుగారు వీళ్లకు యావజ్జీవమున్నూ అన్నవస్త్రాలు జరిగేటట్టు సత్రాలు వేయించడం మనకు విధి అని అలా వేయించారంటూ యెవరో చెప్పఁగా యెప్పడో విన్నాను. బహుశః ఆసత్రాలే కొంతమార్పుతో యిప్పటికిన్నీ జరుగుతూ వున్నాయనుకుంటాను. కాని ప్రస్తుతం జరిగే సత్రాలు తిరువాన్‌కూరు రాజ్యంలోవి. ఆ సత్రాలకు పేరు తంజావూరు సత్రాలు అని వినఁబడుతుంది. ఆకాలంనాటికి తంజావూరున్నూ తిరువాన్కూరున్నూ వకటే రాజ్యంగా వుండేవోయేమో? చరిత్రజ్ఞులకుఁగాని బాగా తెలియదు. యిప్పుడుకూడా ఆ సత్రాల్లో సామాన్య కుటుంబాలవారి మాటలావుండఁగా 60 రూపాయలకు లోపు జీతంగల. వుద్యోగులు కూడా వచ్చి సకుటుంబంగా భోంచేసి వెళ్లడమే ఆచారమని చెప్పుకోఁగా విన్నాను. అంతో యింతో దక్షిణాది వాసనవున్న వేంకటగిరిలో వున్న సత్రంలో ఆవీథివాళ్లొకనాఁడూ యీ వీథి వాళ్లొకనాఁడూగా గ్రామస్థులే తినడం నేను చూచి వున్నాను. కాశీలో యిప్పడెలావుందో చెప్పలేనుగాని ఆ యీ మహారాజులున్నూ మటికొందఱు సంపన్న గృహస్థులు కోటీశ్వరులున్నూ వేయించిన సత్రాల్లో వకపూఁట నిరాఘాటంగా భోజనం దొరకడం నేను స్వయంగానే యెఱుఁగుదును. కొన్ని సత్రాలల్లో “యింతమందికి మాత్రమే" అనే నియమం వుంది గాని కొన్నిటిలో ఆనియమంలేనేలేదు. ఆలాటి నియమంలేని సత్రాలల్లో వకటి అన్నపూర్ణసత్రం. దీన్ని మహారాష్ట్ర ప్రభువు శ్రీమంతుడు వేయించినట్టు చెపుతారు, యిది పన్నెండు గంటలవేళ అన్నం పెట్టే సత్రం. రెండు గంటలప్రాంతంలో యిదేమాదిరిగా “సర్వమోకళా"గా పెట్టే సత్రం సింధ్యా సత్రం. రామనాథపురం మహారాజా సత్రం ఉదయం యెనిమిదీ తొమ్మిదీ మధ్యనే పెట్టేది. రాత్రిమాత్రం యేసత్రంలోనూ అన్నంపెట్టరు. ఆయీ సత్రాలుండఁబట్టే కాశీలో యితరదేశపు విద్యార్థులకు వకపూఁటేనా అన్నం దొరకడం వుంది కనక విద్యాభ్యాసం అనాదిగా జరుగుతూ వచ్చింది. ఆంధ్ర ద్రవిడ కర్ణాట విద్యార్థులకు రాత్రికూడా మారోజుల్లో అన్నసదుపాయం వుండేది. యిప్పుడు ఆలాటి సదుపాయాలన్నీ క్రమంగా అంతరించినట్టు చెప్పకుంటారు. సోమరిపోతు సత్రాలను గుఱించిన యితిహాసం నిజంగా జరిగేవుందో! లేక పుక్కిటి పురాణాల్లోనే చేరుతుందో నిశ్చయించడానికైతే అంతగా ఆధారంలేదుగాని లోకంలో