పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/127

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అతిక్షమ దైన్యాపాదకమా?

131


చేసినవాణ్ణి క్షమించడానికిఁగాని వీలైనపనికూడా కాదది. అయినా ఆ పనిని ఆ పరీక్షిత్తు రాజుగా వుండి యేలాగో చేశాcడు. ఆశమీకుcడు యేలాగో క్షమించాcడు. అంతకు పూర్వకాలంలోగానీ, యిటీవలికాలంలోcగానీ ఆ శమీకుని వంటివాళ్లు లేనే లేరనుకుంటూ వుంటే లేకేం వున్నాఁడని చెప్పుకోవడానికి మహాత్మాగాంధీగారు అవతరించారు. ఈయన శాంతికిన్నీ మన భారతంలో వున్నదానికిన్నీ పోలిక లేనేలేదు. “అతిక్షమదైన్యం తెస్తుం"దని మన మహాభారతం చెపితే చెప్పిందిగాక యీ మహాత్ముని ప్రవృత్తి దాన్ని అన్యథాకరించి దైన్యం తేవడానికి బదులు దైన్యాన్ని పాఱఁదోలుతుందని వొప్పుకోక తప్పని విధి అవుతూ వుంది.

గాంధీగారి సిద్ధాంతాలన్నిటినీ ఆమ్నాయాలుగా శిరసావహించే వాళ్లు చాలామంది వున్నారు. యేకొందఱో వారి సిద్ధాంతాలంటే అంగీకరించనివాళ్లున్నూ వున్నారు. నే నీరెండో తెగలోవాణ్ణే. దేవాలయాలు పుట్టడానికి మూలం ఆగమాలు. ఆ ఆగమాలు వర్ణవ్యవస్థ వగైరాలకు కట్టుబడి “వారికి అంతవఱ"కనిన్నీ “వీరికింతవఱ"కనిన్నీ దేవతాసాన్నిధ్య గమనాన్ని గూర్చి వ్రాసివున్నాయి. ఆ వ్యవస్థను పూర్తిగా గాంధీగారు తొలగించివున్నారు. ప్రజాబాహుళ్యాభిప్రాయాన్ని తోసివేయలేక అర్చకులు ఆగమాలమాట తలపెట్టక జీవనోపాధి చెడుతుందని అన్నిటికీ సిద్ధపడవలసినవాళ్లయినారు. ఆయీ సందర్భాలుకూడా శాంతి పురస్సరంగానే త్రికరణశుద్ధిగా మహాత్ముఁడు నడిపినప్పటికీ బాగా ఆలోచించిచూస్తే యిందులో కొంత పశుబలంవుందిగాని లేకపోలేదు. "చండాలో౽స్తు సతుద్విజో౽స్తు గురుః" అనే శాంకరవచనం గృహస్థ విషయంకాదు. సర్వసంగ పరిత్యాగం చేసిన సన్న్యాసులవిషయం. గాంధీగారు నిజమైన సన్యాసు లనిపించుకునే యెవరికిఁగాని దీసిపోరు సరిగదా! పైపెచ్చు వారినందరినిన్నీ అతిక్రమిస్తారేమో! అని కూడా వారి ప్రవర్తనవల్ల గోచరిస్తుంది. అట్టివారికి దేవాలయాలు సర్వే సర్వత్ర అందఱికీ సమానమైన హక్కుకలవిగా కనపడ్డప్పటికీ గృహస్థులకు యితరభేదాలతో పాటు యిక్కడకూడా కొన్ని భేదాలు వుండకతప్పదు. దేవీ భాగవతంలో జనకుఁడు శుకుణ్ణిగూర్చి ఆయీ సందర్భాన్ని కొంత విశదంగా ముచ్చటించియున్నాఁడు. మొత్తం తేలే సారాంశం - గృహస్థులకు భార్యా పుత్రికాది భేదాలతోపాటు కులభేదాలున్నూ పరిత్యజించకుండా వుండవలసినట్టు కనబడుతుంది. అద్వైతంలో కూడా పరమార్ధావస్థలో అభేదం వుపాదేయంగా సిద్ధాంతిక మైనప్పటికి వ్యవహారావస్థలోభేదాన్ని అంగీకరించ వలసిందే అని స్పష్టంగా కనబడుతుంది. “ప్రతిమాస్వల్పబుద్దీనామ్" అనడంవల్ల సామాన్యులకుఁగా యేర్పడ్డ దేవాలయాలు భేదోపాధిని తోసివేయడానికి లేశమున్నూ అంగీకరించవని వ్రాయనక్కఱలేదు. యిది విషయాంతరం.