పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

132

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

మనకు ప్రస్తుత మేమిటంటే? భారతాదులలో చెప్పిన శాంతికంటె మించిన శాంతి వహించి దానివల్లవున్న ప్రయోజనాన్ని ఋజువుచేసిన - చేయుచున్న - చేయనున్న మహాపురుషుఁడు ఈ కాలంలో గాంధీగారనిన్నీ యీయనకు దీటగుశాంతి వక్క శమీకుని యందు గోచరిస్తుం దనిన్నీ యిట్టి మహాపురుషుఁడు మృగ్యుఁడనిన్నీ యీయన్ని పురస్కరించుకొని మనం “మాలోయిట్టి మహాపురుషుఁడున్నాఁ"డని గర్వించవలసిందే కాని సర్వవిధాలా ఆయన్ని అనుసరించడం బొత్తిగా సంభవించ దనిన్నీ ఆచరించేయోగ్యత వుంటే అతిక్షమకూడా దైన్యాపనోదనమే అనేది భారతానికి అతీతమైన సిద్ధాంతం అనిన్నీ తెలుసుకోవలసివుంటుంది. ప్రతీ సందర్భంలోనున్నూ యీలాటివిశేషాలు కొన్ని వుంటూనే వుంటాయి. వాట్లను వదిలిపెట్టి సామాన్య సందర్భాలే సర్వజనాచరణ యోగ్యాలుగా మనం చూచుకోవాలి. భారతంకూడా అదేతాత్పర్యంతో శాంతిని వప్పుకుంటూ కూడా అతి శాంతిని మాత్రం వప్పుకోలేదనుకోవాలి. దీన్నే మనవాళ్లు- “తొక్కినా కఱవకపోతే బురదతొస్సురా” అంటారని సామెతగా చెప్పకుంటూవుంటారు.

కొందఱుపైకయితే చాలా శాంతులుగానే కనపడతారు గాని వారి అంతస్సుమాత్రం చాలా అశాంతంగానే వుంటుంది. బహిశ్శాంతికంటె అంత శ్శాంతికే వేత్తలైనవారు యెక్కువ గౌరవాన్ని యిస్తారు. శాంతితగ్గిన మనస్సుతో యెవరుగాని యెవరితోఁగాని ప్రసంగించడం యుక్తంకాదు. వ్రాఁతకి దిగడంకూడా ఆలాగే. కోపంతో వకప్పడేదేనా వ్రాసినప్పటికీ తిరిగీ దాన్ని శాంతికలిగినపిమ్మట పరిశీలించి సవరించు కుంటే అంతచిక్కుండదు. పరిశీలించకుండానే ప్రకటించేయొడల దానివల్ల వచ్చేచిక్కుకు పరిమితంటూ వుండదు. దాన్ని సమర్థించుకోడానికి బ్రహ్మక్కూడా తరంకాదు. యీ విషయం వాదోపవాదాలలో ముఖ్యంగా గమనించడం ఆవశ్యకం. తాత్కాలికంగా పొంగినపొంగుతగ్గి మనస్సు శాంతించాక చెప్పేసమాధానం వఱదకాలం దాఁటిన తరువాత వుండే నదీజలంలాగ నిర్మలంగావుండి లోకులు ఆస్వాదించడానికి అర్హత కలిగివుంటుందని నేననుకుంటాను. కోపంవచ్చీ రావడంతోనే వ్రాఁతకు వుపక్రమిస్తేనో? అది తొలకరిలో చెత్తాచెదారం మట్టీమట్రాతోటీ వచ్చే వఱదలాగా ఏదో మాదిరిగా వుండవలసివస్తుంది.

ధర్మాలు వేఱు, ధర్మసూక్ష్మాలు వేఱు, అంతో యింతో ధర్మాలు తెలియనివా రంటూ వుండనే వుండరు. ధర్మసూక్ష్మాలు తెలిసినవారో యెక్కడోగాని వుండరు. ఉదాహరణకోసం కొందఱిని వుటంకించి కొంచెం మాట్లాడుకుందాం. రాముఁడు మహాపురుషుఁడు, సాక్షాత్తుగా భగవదవతారం - మహావీరుఁడు. అట్టివాఁడు భవిష్యత్కార్య గౌరవాన్ని పురస్కరించుకొని వాలివధలో కొంత అనుచితం చేయక తప్పిందికాదు. దాన్ని