పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతిక్షమ దైన్యాపాదకమా?


క. "క్షమ మేలగు నైన నతి
     క్షమదైన్యము దెచ్చు నెదురు గర్వించినఁగ
     య్యమువొడిచి గెలిచి యరిశే
     షమునెడసదయక్షమావిశదుఁ డగుటొప్పున్"

అంటూ శ్రీమహాభారతములోవుంది. దీనితాత్పర్యం యెఱఁగనివారే వుండరు. యేముంది యిందులో? శాంతిగా వుండడమైతే చాలా మంచిదేకాని- "అతి సర్వత్ర వర్జయేత్" కనుక మిక్కిలీ శాంతిమాత్రం పనికిరాదు సుమా! అని ఫలితార్థం. యీసందర్భం మనఋషులందఱూ పాటించేవున్నారు. కాని యెప్పడో వకప్పుడు ప్రతిఋషిన్నీ వ్రతభంగంచేసుకున్నట్టుకూడా కనపడుతూనే వుంటుంది. అంతమాత్రంచేత వారు శాంతిధనులు కారనుకోవడానికి వల్లకాదు. ఆ మహర్షులకు యీశాంతి వక్కటి మాత్రమేకాదు; దీనితోపాటు ఇంకా మఱికొన్ని సుగుణాలు యెప్పడూ యెడఁబాయకుండా వున్నట్లు గ్రంథాలవల్ల గోచరిస్తుంది.

శా. “ఆలస్యంబొకయింతలేదు శుచి యాహారంబు నిత్యక్రియా
     జాలంబేమఱ మర్చనీయు లతిథుల్ సత్యంబ పల్కంబడున్
     మేలై శాంతియు బ్రహ్మచర్యమును నెమ్మిందాల్తు మట్లౌటనె
     క్కాలమ్ముం బటు మృత్యురోగ భయశంకల్ వొంద మే మిమ్ములన్."

ఈ పద్యంలో వున్న లక్షణాలన్నీ సత్త్వగుణానికి సంబంధించినవే. యిట్టి సాత్త్వికవృత్తి యిహపరలోకములు రెండిటికిన్నీ మెప్పు సంపాదించేదే. చతుస్సముద్ర ముద్రితమైన ధరామండలాన్ని లేదా స్వర్గమర్త్య పాతాళలోకాలు మూఁడింటినిన్నీ పరిపాలించడంకన్న యీశాంతి మహా సామ్రాజ్యాన్ని పరిపాలించడమే పరమోత్కృష్టమంటే విజ్ఞులెవరూ కాదనరు కాని త్రిలోకాధిపత్యాన్నేనా సంపాదింపవచ్చునేమోకాని దీన్ని సంపాదించడం కష్టసాధ్యమూ కాదు అంటే కేవలమూ అసాధ్యమే అనుకోవాలి. భారతపద్యంలో శాంతినయితే సామాన్యతః విధించడం జరిగిందిగాని వొక్కొకప్పుడు ఆశాంతిని వర్ణించడానికి కూడా అభ్యనుజ్ఞ యిచ్చినట్లు తేలుతూవుంది. ఆ పద్ధతిని లోకంలో అందఱూ శాంతులే అనిపించుకుంటారు.