పుట:Chandrika-Parinayamu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుబేరుఁడు రవ్వలభుజకీర్తిని, ఈశానుఁడు కనకాంబరమును బంపఁగా నా యాభరణములన్నిఁటిని సుచంద్రున కలంకరించిరి. పెండ్లికొడుకై వచ్చు నతని భద్రగజముపై నధిరోహింపఁజేసి వాద్యవిశేషములతోఁ దీసికొని వచ్చుచుండఁగా నగరనారీమణులు తమ తమ మేడలపై నెక్కి యానందముతోఁ గాంచుచు ముత్యాలసేసలు చల్లిరి. అట్లు వచ్చిన సుచంద్రునిఁ గనకపీఠముపైఁ గూర్చుండఁబెట్టి పాదములు గడిగి, మధుపర్కము నొసంగి, తెరచాటునకు చంద్రికను దెచ్చి, కన్యావరణముఁ జెప్పి, ధవళ ములు పాడి, క్షణదోదయుఁడు సమంత్రకముగాఁ గన్యాదానముఁ జేసెను. పిమ్మట వధూవరులు జీరకగుడములను లగ్నసమయమున పరస్పరశిరంబులం దుంచుకొనుట, వరుఁడు ‘మాగల్యం తంతునానేన’ అను మంత్రపూర్వకముగాఁ దాళిబొట్టును గట్టుట, తలంబ్రాలు బోసికొనుట, కాడినిఁ దెచ్చి కపిలావాచనము చేయుట, కంకణధారణముఁ జేయుట, లాజహోమము నెరవేర్చుట, సన్నెకల్లును ద్రొక్కించుట, ఆశీర్వచన మంగళహారతులను గొనుట, దేవతాగృహప్రవేశసమయమున వధూవరుల నామధేయములను జెప్పించుట మొదలయిన వివాహప్రక్రియలను సమంత్రకముగా సంప్రదాయప్రకారముగా నాలుగురోజులు జరుపఁగా చంద్రికాసహితుఁడై సుచంద్రుఁడు మిక్కిలి యానందించెను. ఇట్లు వేదవిధానమును బ్రాహ్మణులు దెలిపి శేషహోమాంతము మంగళాచరణము లన్నియుఁ దీర్చి యాశీర్వదించిరి.

బంధువులు, నానాదేశరాణ్మణులు, హితులు, మంత్రులు నాసుచంద్రునికి రత్నములను, ఆభరణములను, పైఁడివల్వలను కట్నములుగా నొసంగిరి. పాంచాలభర్త యల్లునికి భద్రవారణశతములను, హయకులములను, ఉజ్జ్వలరథములను, దాసదాసీజనములను, వజ్రవైడూర్యాదిమణులను, మణిచాపమును, బాణసముదాయమును, ఖడ్గమును, ముద్గరము మున్నగు నాయుధములను ఇచ్చి, పుత్రికకు పురశతములను పసుపుఁగుంకుమకై యిచ్చెను. రతనాలసొమ్ములు, జల్తారుచీరలు, క్రొత్తకస్తురివీణ, చామీకరపేటికోత్కరములు మొదలయిన వాని నెన్నింటినో యిచ్చెను. బ్రాహ్మణపురంధ్రులు, దిక్పాలవనితలు పెండ్లికూఁతును దీవించిరి. పార్వతి, తనమహిమచేత చంద్రికకు నిత్యాంగరాగము, చేయని సింగారము, వాడని విరి, పాయని తారుణ్యము, వీడని సొంపుపెంపును గలిగియుండునట్లు దీవించెను. అంతేకాక