పుట:Chandrika-Parinayamu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పత్రము లారతులుగాను జేయుచు తమిస్రాసురుని రణచండికి బలిగా నొసంగి, మునుల యాశీస్సులను బడసిన మహావీరుఁడు. ఇతఁడు సకలనుత్యకళాశాలి, సౌరవంశమౌళి. బింబోష్ఠీ! విలంబమును మాని యితనిని వరింపు మనఁగా తన్మనోనాయకసంవరణ సముద్వేగ వలమానమానసయై తదనుజ్ఞ చేత నతఁడున్న కాంచనమంచక మెక్కి మంజుల మంగళపుష్పదామమును సుచంద్రునికంఠమున వైచెను. దమయంతి నలుని వరించినతీరున నున్న యా చంద్రికాసుచంద్రులను జూచి సూర్యచంద్రవంశ్యరాజు లందఱును సంతసించిరి. దేవతలు పుష్పవర్షమును గురిపించిరి. తాపసాధిపులు దీవించిరి. దేవాంగనలు నృత్యముఁ జేసిరి. క్షణదోదయుఁ డానందించెను. పార్వతి తన నిజరూపమును ధరించి సుచంద్రునికి భువనేశ్వరీమహామంత్రము నుపదేశించెను. సిద్ధసంకల్పుఁడై సుచంద్రుఁడు తన శిబిరమున కేగెను. పాంచాలవల్లభుఁడగు క్షణదోదయుఁడు సుచంద్రుఁడు చంద్రికను బెండ్లియాడఁదగిన శుభలగ్నమును నిర్ణయింపఁజేసి ధన్యమ్మనుఁ డాయెను. పురము నలంకరించుటకు శిల్పుల నాదేశించెను. వారు నగరము నంతటిని రమణీయముగా నొన ర్చిరి. మంగళవాద్యములు భూనభోంతరాళములందు మ్రోగుట కారంభించెను. ముత్తైదువులు గౌరీకల్యాణములు పాడిరి. చంద్రికకు మంగళస్నానమును రత్నపీఠిపై నుంచి “శోభానేశోభనమే” యని పాడుచు నిర్వర్తించిరి. సుంకులు చల్లిరి.స్నానము చేయించిరి. జడ యల్లి, మొగమున చంద్రరేఖబొట్టును దీర్చి, గంధము పూసి, కంకణాద్యలంకారములు పెట్టి, మకరికాదిపత్ర రచనలు చేసి, వజ్రమాలిక వేసి అలంకరించిరి. పెండ్లికూతురును చేయుటలో శచీదేవి, స్వాహాదేవి, యమభార్య, నిరృతిభార్య, వరుణదేవుని భార్య, వాయుపత్ని, కుబేరపత్ని, పార్వతీదేవి మొదలగువారు తమతమ యంతస్తులకుఁ దగిన యాభరణము లూన్చి సహకరించిరి. అంతకు ముందే బంధు, వయస్య, దండనాథముఖ్యులు సుచంద్రునిఁ బెండ్లికొడుకును గావించుటకు తరుణులను బంపఁగా వారు మంగళవాద్యనినాదములతో, ముత్తైదువుల పాటలతో స్నానము చేయించి, తల దువ్వి, సకలాలం కారములు గైసేసి పెండ్లికొడుకును చేసిరి. ఇంద్రుఁడు ముత్యాలయంటుజోళ్లను, అగ్ని ముత్యాలహారమును, యముఁడు మణీహంసకమును, నిరృతి రత్నాలపతకమును, వరుణుఁడు ముత్యాలబాసికమును, వాయుదేవుఁడు కెంపులయుంగరమును,