పుట:Chandrika-Parinayamu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రేయసీప్రియుల పొలయలుకలను భావికాలమునఁ దీర్పఁగల చిలుకను, సకలఋతువులందును వికసించి పరిమళము గురియు నొక పువ్వును, కోరిక లిచ్చుచు దేవకాంతలను మించు చక్కదనమును గూర్చు నొక రత్నమాలికను సైత మిచ్చి, కౌఁగిలించుకొని యాశీర్వదించి, కైలాసమున కేగెను. పెండ్లికి వచ్చినవా రందఱును బహుమానము లందుకొని వెళ్లిపోయిరి.

క్షణదోదయుఁడు చంద్రిక నత్తవారింటికిఁ బంపువాఁడై కౌఁగిటఁజేర్చి, కన్నీరు గార్చుచు, “తల్లీ! పుట్టినయింటికిని మెట్టినయింటికిని శుభకీర్తులు వచ్చునట్లు మెలఁగుము. ఈనారి వంశధర్మనిరూఢిని గాపాడినది. ఈశ్యామ గురుతరులకు వన్నెఁ గూర్చినది. ఈపద్మిని యినోదయమున కానందించును. ఈకొమ్మ ద్విజరాజులను బోషించును. అని జగము మెచ్చ నడుచు వనితజీవనమే జీవనమని యెంచుమమ్మ!” అనఁగా, తల్లి చేరఁదీసి కన్నుల నశ్రులు రాల్చుచు “లతాంగీ! చంద్రశేఖరుఁడు శైలేంద్ర తనూజ యంతటి దానిని అర్ధాంగీకారముగా నుంచినాఁడు. కనుక భర్త చిన్నచూపుఁ జూచినను సమయానుకూలముగా వర్తింపుము. భర్త యత్యధికప్రేమను జూపినను నీవు వినయముతోనే యుండుము. భర్తతోఁ గలిసిమెలసి యుండుము” అని బుజ్జగించి పంపఁగా సుచంద్రుఁడు చంద్రికాయుతముగా సువర్ణమయరథము నెక్కి స్వనగరముఁ జేరఁబోయెను. పౌరాంగనలు సౌధములపై బారులు దీరి కంకణఝణత్కారములు మొరయఁగా వధూవరులపైఁ బుష్పాంజలులు చల్లి యానందించిరి.

పిమ్మట ఇంద్రనీలమణిస్తంభములతోను, రవ్వలబోదెలు, తామరల రత్నాల కుక్షి, పన్నీటియంత్రములు, బంగరుబొమ్మల చేతులలో నుంచబడిన వట్టివేరుల సురటీలు మొదలగు వైభవములు గల క్రీడాగృహమునందు, రతిరహస్యశృంగారకళలకు నిలయమైన కుసుమతల్పమున లజ్జాభరావనతవదనయైన చంద్రికను జేర్చి, చెక్కిలిపై నఖక్షతములు బడనీక, గుబ్బల కధికసమ్మర్దము నీయక, అధరోష్ఠపానమున దంతక్షతముల చిహ్నములు లేకుండునట్లుగ, తనూలత కధికశ్రమము గలుగనీయక, సుమశస్త్రశాస్త్రరహస్యతత్త్వము నెఱిఁగిన సుచంద్రుఁడు చంద్రికకు అతనుశాస్త్రస్వరూపముల నెఱుకపరచుచు, నద్వయభావనాయత్తవృత్తి యేర్పడునట్లు ప్రియసాయుజ్య