పుట:Chandrika-Parinayamu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వనరాశి రవి మాధవతఁ దోఁప నంబరా
గమునఁ బొల్చిన జాలకంబు లనఁగఁ,
దఱి రా శుభము వేల్పుతెఱవచాల్ గన నాక
ఘనకుడ్యకృత జాలకంబు లనఁగ,

తే॥ గురుసరశ్శ్రేణి రాజీవకులము నడఁచి
యంబరస్థలి నాఱ దిష్టాఖ్యమైని
కతతి పఱచిన వరజాలకంబు లనఁగఁ
జొక్కమగు మింటఁ గనుపట్టె రిక్క లపుడు.

ఇది నక్షత్రవర్ణనము. యమకాలంకారముకొఱకై ‘జాలక’శబ్ద మిందులో వరుసగా సమూహము, బిందువులు, మొగ్గలు, గవాక్షములు, క్రొత్తవలలు అను భిన్నార్థములం దయిదు పర్యాయములు ప్రయోగింపఁబడినది. ‘మైనికతతి’ యనఁగా మీన ఘాతుకుల గుంపు (చేపలను జంపువారలగుంపు). ‘పక్షిమత్స్యమృగాన్ హన్తి’ అను పాణినీయసూత్రముచేత తద్ధితప్రత్యయ మగు ‘ఠక్’ అనునదియు, దానికి ఇకాదేశము వచ్చి ‘మైనికః’ అను శబ్ద మేర్పడును. మీనమును జంపువాఁడని యర్థము. ‘మత్స్యపర్యాయేషు మీనస్యైవ’ అని భట్టోజీ చెప్పెను. అందువలన ‘మాత్స్యికః, మైనికః’ అనునవి మాత్రమే సాధువులు. నక్షత్రములు, సంధ్యానటుఁడగు శివునితలపై దిగంగనలు చల్లు తెల్లని యక్షతలవలెను, అంధకారమను నది నేలపైకిఁ బ్రవహించుటకు దిగఁగా నాకసమున నంటియున్న జలబిందువులవలెను, సముద్రమున సూర్యుఁడను వసంతుఁడు గన్పట్టగా గగనమను వృక్షమునకుఁ బూచిన మొగ్గలవలెను, దేవతాస్త్రీలు చూచుటకు గగనకుడ్యమునకు జేయఁబడిన గవాక్షములవలెను, సంధ్యాకాలమున బెస్తవారు సరస్సులయందలి కమలము లనెడు మత్స్యములను బట్టుకొని యాకాశమున నాఱవేసిన వలవలెను గనపడుచున్నవని పద్యభావము.

మ॥ అనిశంబున్ బుధవర్ణ్య కల్పతరు దీవ్యద్వాసనాలబ్ధిఁ జే
కొని యద్వైతరుచిం గరంబు మను నీక్షోణీస్థలాధీశవ
ర్యుని కీర్తిప్రకరంబు మించ, సకి! యోహో! పూర్వపక్షావలం
బనతన్ రాజిలునట్టి ధ్వాంతపరధామం బెచ్చునే యెచ్చటన్.