పుట:Chandrika-Parinayamu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తే॥ తరుణి చనుదోయి కెంపుగందవొడిఁ బూసి,
చెలువ నెమ్మేను కౌఁగిటఁ జేర్చి, కొమ్మ
మోము ముద్దిడి, పూఁబోణిమోవిఁ గ్రోలి,
చెలఁగు టెపు డబ్బునో యంచు దలఁచు నృపతి.

పై పెద్దపాదములకును గీతమునందలి పాదములకును, సంబంధమును గల్పించు క్రమాలంకారశోభతో నిది మనోహరముగా నున్నది.

సీ॥ బాలాంబుజతమాల మాలాభినవజాల
జాలామృతోల్లోల షట్పదౌఘ,
రాగాది పరమాగ మాగాంత సుపరాగ
రాగావరణభా గరాళపవన,
కేళీగృహ న్మౌళి మౌలిస్థిత పికాలి
కా లీనరవ లోలితాధ్వగాత్మ,
రాజీవశర వాజివాజీన నిరతాజి
తాజీ జనక రాజితామ్రఫలిక,

తే॥ భవ్య ఋతుకాంత కాంత తాత్పర్య సృష్ట
ఘన విషమబాణ బాణసంఘాత కలిత
తిలక మధుగంధ గంధ సంచులుకితాశ
కనదచిరధామధామ! యివ్వనిక గంటె?

ఇది కామజ్వరముచేత బాధపడుచున్న చంద్రికతోఁ జెలికత్తెలు ఉద్యానవనసౌందర్యమును వర్ణించుచుఁ బలుకు ఘట్టము లోనిది. వనిక=చిన్నవనము, ఉద్యానవనమని యర్థము. యమకాలంకారభూయిష్ఠముగా రచింపఁబడిన చతుర్థాశ్వాసములోని పద్యము లన్నియు నిట్టి శబ్దవిన్యాసము గలవియే. ఈపద్యము వాటికి మచ్చుతునుక.

సీ॥ నటదీశమౌళి దిఙ్నారులు చల్లు మం
గళ సితాక్షత జాలకంబు లనఁగ,
నచలావపతనవేళాభ్ర లగ్న తమఃక
దంబాపగా జాలకంబు లనఁగ,