పుట:Chandrika-Parinayamu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మగుటచేత నిచ్చట ‘నక్షిలక్ష్యగతిఁ దాల్చిన’ అని ప్రయోగించెను. వస్తుప్రమాణవిషయమందు అణుకం, ద్వ్యణుకం, త్ర్యణుకం అనునవి యొకదానికన్న నొక్కటి యెక్కువ. అణుద్వ్యణుకములు మనకుఁ గనబడవు. త్ర్యణుకము మొదలుకొని చక్షుర్గోచరము లగును. కనుక చంద్రికామధ్యము త్రసరేణు వై అక్షిలక్ష్యగతిని బొందినదని భావము. ఇదీ అణుమధ్యావ్యవహారము. అట్లే స్వయంవరవర్ణన సందర్భమునందును చంద్రికను ‘పారిమాండల్యవన్మధ్య’ అని సంబోధించెను. అచ్చటను నిదియే యర్థము. పారిమాండల్యశబ్దమునకు పరమాణువని యర్థము. ఇట్లు తన న్యాయవైశేషికశాస్త్రజ్ఞానవిలసితములగు భావములను కావ్యమునం దచ్చటచ్చటఁ బొదిగియున్నాడు. ఇట్లే జ్యౌతిష, యోగ, సాంఖ్య, వేదాంతాది శాస్త్రపరిభాషలను, తత్తద్విషయ పరిజ్ఞానమును వెల్లడించు పద్యము లాయా సంద ర్భములందుఁ గలవు.

సంగీతజ్ఞానము

బ్రహ్మదేవుని యాజ్ఞచేత చిత్రరేఖ వచ్చి వసంతమునిని మోహింపఁజేయుటకై చేసిన ప్రయత్నముల సందర్భమున:

ఆయతిలోకమౌళి హృదయంబు బయల్పడ కున్కి గాంచి యా
తోయజనేత్ర యాళితతితో మునిసన్నధిఁ జేరి జాళువా
కాయలవీణెఁ గైకొని తగన్ శ్రుతిఁ గూర్చి యొయార మెచ్చఁగా
నాయెడ నేర్పు మించ గమపాదికపుంఖణ మూన్చి వేడుకన్.

(ఆశ్వాద్వి. ప.93)

‘గమపాదికపుంఖణ’ మనఁగా గాంధార, మధ్యమ, పంచమ స్వరముల మూర్ఛన యని యర్థము.

సీ. ఘనమార్గవిభవంబు వనిత వేణినె కాదు శ్రుతిపర్వరాగసంతతి నెసంగె,
సమతాళవిస్ఫూర్తి సతిగుబ్బలనె కాదు నవ్యగీతప్రతానముల నెనసెఁ,