పుట:Chandrika-Parinayamu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గలహంసవైఖరి చెలిగతులనె కాదు సరసప్రబంధపుంజమునఁ దోఁచెఁ,
బల్లవంబుల పెంపు పడఁతికేలనె కాదు సొగసైన పదపాళి సొంపు పూనె,
తే. ననుచు వనదేవతాజనం బభినుతింప, రక్తివిధమును దేశీయరాగగతియుఁ,
జిత్రతర మంద్రరాగజశ్రీలు వెలయ నింతి మునిచెంత వీణె వాయించె నంత.

(ఆశ్వా. ద్వి. ప.94)

సంగీతశాస్త్రపరిభాషలోని శబ్దములకు చంద్రిక స్తనాద్యవయములతోడి సంబంధము నర్థభేదములచేతఁ గల్పించి చెప్పుట యీ కవి యసాధారణప్రజ్ఞను వెల్లడించుచున్నది. మార్గ, దేశి యని సంగీతము రెండువిధములు. శాస్త్రీయపద్ధతి, సంప్రదాయమును గలది మార్గసంగీతము. దేశభేదమున వైవిధ్యమును బొందునట్టిది దేశిసంగీతము. తాళవిస్ఫూర్తి సతిగుబ్బలకును గీతప్రతానములకును సమమట. మొదట తాళఫలప్రమాణము, పిమ్మట ఆదిరూపకాదితాళములు గీతములకు, తానములకును తగియుండుట. ‘కలహంస’ రాగము పేరు. అట్లే ప్రబంధము, పల్లవము, పదము, రక్తి, దేశీయరాగగతి, మంద్రాదిశబ్దములు సంగీతశాస్త్రపారిభాషికములు. వాటికి చక్కని యర్థములు గల్పించెను.

చెన్నగు జాళువాయొళవు చిన్నరికెంపులమెట్లు నీలపు
న్వన్నియ నొప్పు కాయలు నవంబగు వజ్రపుకర్వె బచ్చలం
బన్నినయట్టి మేరువును బాగగు తంత్రులు మించ నొప్పు మే
ల్కిన్నర చెంతఁజేరి యొకకిన్నరకంఠి యొసంగ నయ్యెడన్.

(ఆశ్వా. ద్వి. ప.95)

ఇది వీణాస్వరూపమును బాగుగా నెరిఁగిన పద్యము. కిన్నరవీణకు మరియొక పేరు.