పుట:Chandrika-Parinayamu.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. హరివంశోత్తము సద్గుణాళి విని నిత్యం బేము వర్ణింప స
త్వరబుద్ధిం గనఁ జాన గోరుఁ బతి నాత్మం, గాంచ మాకుం దదం
తర మెల్లప్పుడు మించుఁ గాన, నలగోత్రాభర్త నే మిప్పు డే
కరణిం గాంతుము, గాంచుదారిఁ గృప నిక్కం దెల్పవే నావుడున్. 77

మ. వనితా యావిభుఁ గాంచువాంఛ మదిఁ జెల్వం బూనినం గాంచవే
జనితాసక్తి నృపాలు మామకకరచ్ఛాయ న్మనోవీథి నూ
త్ననితాంతాద్భుత మబ్బ నంచు మహిమం దత్సద్గుణశ్రేణికా
ఖని తాఁ బ్రాక్కృతమాయ నంతయుఁ జనం గావింప నప్పట్టునన్. 78

సీ. బెళుకుచూపులవానిఁ, బలుమాఱు బలుమారు
సొంపు నిందించుమేల్సొబగువాని,
నొఱపు మించినవాని, నెఱమించునెఱమించు
మెలపుఁ గందించు నెమ్మేనివాని,
సొగసు మీఱినవానిఁ, బగడంబుపగడంబు
తలఁపుఁ గుందించుమేల్తళుకువానిఁ,
గళుకు హెచ్చినవానిఁ, గపురంపుకపురంపు
వలపుఁ జిందించునవ్వొలయువానిఁ,

తే. గళ మెలకువాని, మంజులోజ్జ్వలమువానిఁ
జెలువు గలవాని, నొయ్యార మలరువాని,
నభ్రయానసమాసీను, నాక్షితీశుఁ
జూచి వెఱగంది నిలిచి రాసుదతు లపుడు. 79

చ. పులకలు మేన నిక్క, వలపుంబస మానసవీథిఁ జిక్క, దృ
క్స్థలి ననిమేషవిస్ఫురణ దక్కఁ, బ్రమోదము చిందు ద్రొక్క, ని
ర్మలమణిపీఠి డిగ్గి యొకమానిని కేల్కయిలాగు వూని యా
యలికులవేణి రాజకుసుమాశుగుఁ గాంచె నొకింత సిబ్బితిన్. 80