Jump to content

పుట:Chandrika-Parinayamu.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ. సరసకలాంచితాస్యుఁ డయి, చారువిలోచనపద్ముఁడై, కళం
కరహితగాత్రుఁడై, జగతిఁ గన్పడు నానృపమౌళితో జనుల్
హరిముఖునిన్, సుమాంబకుఁ, గళంకసమన్వితగాత్రుఁ బోల్తురే
నిరుపమసౌందరీవిధికి నిచ్చలు సాటి యటంచు నెమ్మదిన్. 71

చ. అవనిపచంద్రరూపవిభవాతిశయశ్రవణోయమానమో
హవితతి యూను భోగిమనుజామరకన్యల నిచ్చ నేఁచుఁ బం
చవిశిఖుఁ డాశుగత్రితయిఁ జక్కగ శేషశరద్వయంబుఁ గాం
క్ష వెలయ డాఁచు ముంగల నఖండఫలంబు వహించు నన్మతిన్. 72

తే. ఇట్టి సకలానఘగుణోత్కరాబ్ధి యైన
యామహీకాంతుతో మైత్త్రి యడరు కతన
నిన్నిదినములు తద్యోగ మెనసి యుంటి
నెడయ నేఁ గొమ్మ హృద్వీథిఁ బొడమ కున్కి. 73

ఉ. ఈనృపకన్యఁ జూచురతి నిప్పుడు తజ్జనరాడనుజ్ఞ చేఁ
బూని రయాప్తి వచ్చితి, నపూర్వవిలాసినియై రహించు నీ
మానినిఁ గాంచ నిత్తఱి నమందముదావళిఁ జెందె నాత్మ, కం
జానన! యంచు నామయుకులాగ్రణి వెండియుఁ బల్కు నాచెలిన్. 74

చ. అళికచ! నెమ్మదిం దలఁప నప్పతికే తగు నీవెలంది, యీ
జలరుహనేత్రకే తగు రసారమణేంద్రుఁడు, గాన నామనో
జలలితమూర్తి యీలలనఁ జక్క వరించినఁ గాక మామదిం
దళమయి మించ నేర్చునె యుదారకుతూహలవార్ధివీచికల్. 75

మ. కనుగల్వ ల్వికసిల్ల, మోదము పొసంగన్ దజ్జనాధీశచం
ద్రుని వీక్షించినఁ గాని మామకహృదుద్భూతస్పృహారేఖ యి
మ్మెనయం జాలదు, చాన, యవ్విభుని మీకీలోపలం గాంచఁ గ
ల్గు నన, న్గోమలి కిన్నరేశ్వరునిఁ బల్కు న్గోర్కి దైవాఱఁగన్. 76