పుట:Chandrika-Parinayamu.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ. జనపతియాస్యచంద్రుఁ గనఁ జాలఁ జెలంగు వధూటికావలో
కనకుహనాచకోరములు గ్రక్కున వ్రీళతమశ్చయంబు పొ
ల్చిన భ్రమియింప దాని సడలించె మరుండు విచిత్రశక్తి నూ
తనశరజాతనిర్వమదుదారశిఖోదయరాగవైఖరిన్. 81

తే. చెలిఁ దఱియ వచ్చునరపాలసితదృగాళి
దారి నానారిచూపుచా ల్దవిలి నడచె
నపుడు గగనధునీప్రవాహంబు సొచ్చి
వేగ యెదురెక్కు మీనౌఘవిధి వహించి. 82

చ. నిజబలరూఢి దోఁపఁ దఱి నివ్వటిలెన్ బళి యంచుఁ దాఁ జతు
ర్భుజుఁడయి పంచసాయకుఁడు భూరిధృతిన్ క్షణదోదయాధిపా
త్మజబొమవింటిదోయి నసమానవిలోచనమాలికాసితాం
బుజవిశిఖాళి నించె నలభూపతి పేరెద గాఁడి పాఱఁగన్. 83

చ. అలవిభుఁ గాంచుఁ, గాంచి యెద నప్పతిరూపము నుంచు, నుంచి ని
శ్చలమతి నెంచు, నెంచి మది జాఱనికోర్కుల ముంచు, ముంచి యూ
ర్పులు కడు నించు, నించి వలపుల్ మన నాత్మ భ్రమించు, మించుఁబోఁ
డి లసదనంగసాయకతటీవిలుఠత్పటుశాంబరీగతిన్. 84

క. ఈలీల నృపతిదర్శన
కేళీభవవిస్మయానుకీలితమతియై
నాళీకనయన ఆ! లల
నాళీకమలాస్త్రుఁ డనుచు నతనిం బొగడెన్. 85

సీ. తనవిధుత్వ మ్మాస్యమున నొప్ప ఘనలక్ష్మి
యొనరఁ దోఁచినపూరుషోత్తముండు,
తనతమోగతి కైశ్యమునఁ దోఁప సద్గణ
త్రాణంబునకుఁ జేరు రాజమౌళి,