పుట:Chandrika-Parinayamu.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ. అనుదినముం బ్రియంబును దయామహిమంబును మించ వత్తు రీ
జనవరపుత్త్రికామణికిఁ జక్క విపంచిక నేర్ప నేఁటికిన్
జనియె సుమీ యనేకదివసంబులు మీ రిట రాక నేఁడు నిం
దునిఁ దెలికల్వలో యన నినున్ గనఁ గోరు మదీయనేత్రముల్. 65

చ. మునుపటియట్ల యిచ్చటికి మోదముతో నరుదేరకున్కి కో
జనపరివర్ణ్యదివ్యగుణజాలక కారణ మేమి యేపురం
బెనసితి రేవిశేషగతు లింపుగఁ గాంచితి రేనృపాలుతో
ననువగు మైత్త్రి సల్పితిరి యంతయుఁ దెల్పఁగదే దయామతిన్. 66

క. అన వనితావాక్యసుధా
జనితామోదవృతమానసపయోరుహుఁడై
యనువార యక్షవిభుఁడి
ట్లను వారణయానఁ గని మహామధురోక్తిన్. 67

మ. కలఁ డత్యుత్కటధాటికాతురగరింఖాజాతభూక్షోదక
జ్జలచిహ్నాప్తమహఃప్రదీపహృతతీక్ష్ణధ్వాంతవేలాకుభృ
ద్బిలగేహప్రతిమాయితామితసమిద్భేరీకులధ్వానమం
డలనిర్విణ్ణరిపుక్షితీంద్రుఁడు సుచంద్రక్ష్మాపచంద్రుం డిలన్. 68

మ. సరసీజాతహితాన్వయేశ్వరుయశోజాతంబు చక్రాప్తమై
హరిశోభాంచితమై భృతాబ్జనికరంబై రాజిలం దత్తులే
తరభావోదితపంక మంకవిధిచేత న్మేనునం గప్పినన్
సురకుత్కీలవరప్రదక్షిణముఁ బూనుం జంద్రుఁ డశ్రాంతమున్. 69

మ. పరవాహిన్యధినాథజీవనహృతిం బాటిల్లు తద్భూపని
ర్భరధామస్థితి తన్మహాప్రథనగోత్రాధూళి తద్వృత్తిమైఁ
గర మొప్ప న్వలయాద్రిఁ జేరుఁ దదరిక్ష్మాపాళినైజాంగముల్
వరకీరాళిపికవ్రజం బనుచరత్వం బూనఁగాఁ జేయఁగన్. 70