పుట:Chandrika-Parinayamu.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ. అని పతి సన్నుతించు, హృదయంబున విస్మయ ముంచు, నేఁడుగా
యనుపమశక్తి దర్పకున కబ్బె నటంచు వచించు, నవ్విరిం
చనుశుభసర్గకోవిదత సారెకు నెంచు, నిమేషరాహితిం
గనుఁగవ వూన వెండియును గాంచు వెలందిఁ దదేకతానతన్. 59

చ. అపుడు మహీంద్రుతోడ నలయక్షవిభుండు వధూటిఁ గంటివే
తపనకులేంద్ర నాపలుకు తథ్యత గాంచెఁ గదా తదాప్తి నే
నిపు డట కేగి కొమ్మకుఁ ద్వదేకమతిం బొడమింతు నంచు న
న్నృపతియనుజ్ఞఁ గైకొనుచు హృద్యవిమానము డిగ్గి యత్తఱిన్. 60

చ. వనధరఁజేరి చారుతరువారము చయ్యన దాఁటి పూర్వవ
ర్తన నవలాలఁ జేరఁ జనఁ దామరసానన లెల్ల వచ్చెఁ గా
ఘనగురుఁ డంచు నబ్రమునఁ గాంచఁగఁ గాంచనపీఠి డిగ్గి యా
జనవరకన్య యాళిజనసంవృతిఁ దా నెదు రేగి భక్తితోన్. 61

చ. గురుకుచభారరేఖ నొగిఁ గోమలి యానతి సేయ నాదయా
కరమతి పెండ్లికూఁతురవు గమ్మని దీవన లిచ్చి తద్వధూ
త్కరకృతపూజనావిధులు గైకొని తద్వనితాసమర్పితాం
బరచరరాజరత్నచయభాసురపీఠి వసించె నయ్యెడన్. 62

తే. మనుజపతికన్య సఖులతో మణిమయాస
నమున వసియించె నప్పు డాకొమిరెమిన్న
నెచ్చెలి చకోరి యన మించు నెలఁత యోర్తు
కుముదుఁ దిలకించి యిట్లనుఁ గుతుకఫణితి. 63

చ. హరిసమధామ! యుష్మదరుణాంఘ్రులు గన్గొన నిప్డు మద్దృగం
బురుహము లెంతయుం జెడనిమోదముఁ జేకొనె, దూరమయ్యె దు
స్తరహృదయాంధకారసముదగ్రత లెల్లఁ, బ్రవృద్ధిఁ గాంచె వి
స్ఫురదభిలాషచక్రములు, పొల్పడఁగె న్నిబిడప్రదోషముల్. 64