పుట:Chandrika-Parinayamu.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. వలజారత్నము దోఁచు నెన్నడు మణుత్వస్థేమఁ గాంచం గటి
స్థల మెంతేని మహత్త్వ మంద జడ దోడ్తం దీర్ఘతం బూన ని
చ్చలు గుల్ఫంబులు హ్రస్వతం గన రతీశబ్రహ్మలీలాకృతో
జ్జ్వలమాయాపరిమాణవైభవసమచ్ఛాయ న్విరాజిల్లఁగన్. 56

చ. హరిణధరాస్యమోవిపసలా, కిసలాకృతిఁ బొల్చు నంఘ్రు లా,
యరుణతరోష్ఠిగుబ్బవగ లా, మృగలాలస మూన్చు కన్నులా,
హరినిభవాణిమేనిసటలా, నిటలాకరవాలకమ్ములా,
యరిభిదురోజ నెన్న వసమా యసమాశుగమానభేదికిన్. 57

సీ. కలికిచీఁకటిపిండుగలికిఁ బిల్చుకచాళి
వాలుగలసజాలు వాలుఁగనులు,
బింబమ్మునకుఁ బ్రతిబింబంబు కెమ్మోవి
యేపూను రేరేనియేపు మోము,
ఇంచుమేలిమి నలయించు మేల్పలుకులు
కంబులకన్నఁ బొంకంబు గళము,
జక్కవకవ నేఁచుఁ జక్క వలుదగుబ్బ
లలివధూకులము నాలలిత మారు,
వాపులసిరి సారె వాపు లసన్నాభి
మెఱుఁగురంభలరూపమెఱుఁగుఁ దొడలు,

తే. తమ్ము లన మంజులశ్రీయుతమ్ము లడుగు
లుడుపురాణాస్యకాంతుల నుడుపు గోరు,
లవని నీకొమ్మలావణ్య లవనిరూఢి
యమరసుందరులం దైన నమరఁ గలదె? [1]58

  1. ఇది పంచపాది సీసము