పుట:Chandrika-Parinayamu.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాఁబోలు నీతమ్మికంటి చిరద్యుతుల్
మించఁ బొల్చిన తళ్కుమించుఁదీవ,
కాఁబోలు నీనీలకైశ్య మన్మథశిల్పి
బాగుగాఁ దీర్చిన పసిఁడిబొమ్మ,

తే. యౌర యీచెల్వచెలువ,మయారె యీపొ
లంతి యొయ్యార, మహహ యీయింతిమిన్న
సొంపు, మజ్జారె యీచానసొగసుపెంపు
బళిరె యీలేమఁ బొగడ వాక్పతివశంబె. 53

మ. అతిశోణం బతికోమలం బతివిశాలాత్మం బతిశ్లక్ష్ణకం
బతినిమ్నం బతిమేచకం బతిదృఢం బత్యంతపారిప్లవం
బతివక్రం బతిదీర్ఘ మౌర బళి యీయంభోజపత్త్రాక్షి య
ప్రతిమానావయవప్రతానము మనఃపద్య న్విచారింపఁగన్. 54

సీ. అలరారు నేమొ రమ్యాళిపాళి నెలంత
కులుకుపెన్నెఱులతోఁ జెలిమిఁ గాంచి,
చరియించు నేమొ బల్ మరుమార్గణశ్రేణి
పడఁతిదృగ్రుచి కర్థిభావ మూని,
చెలువొందు నేమొ మంజులకుచంబులు పక్వ
బింబోష్ఠిచనుదోయి పేరు మోసి,
మనఁజేయు నేమొ యింపున ధాత్రి చెలికటి
తటవిస్తృతికి దాదితనముఁ దాల్చి,

తే. యతిశయిలు నేమొ పద్మంబు లనుదినంబు
భామపాదద్వయప్రభాప్రాప్తి నొప్పి
మహిమ గను నేమొ సద్వంశమణిచయంబు
కలికిపదనఖజననశేఖరత నొంది. 55