పుట:Chandrika-Parinayamu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వైదుషీభూషణా!’ యను మకుటత్రయముతో నీతి శృంగార వైరాగ్య శతకముల ననువదించుటయు జరిగినది. బాలసరస్వతీమహోపాధ్యాయుని కనేకసత్కారములు ధనకనకవస్తువాహనములను మాధవరాయలవా రిచ్చియుండినట్లు ఈక్రిందిపద్యము మొదలగు మల్లభూపాలీయరచనలవల్ల స్పష్టపడుచున్నది.

“శ్రీమద్బాలసరస్వతీ ప్రకటలక్ష్మీహేతువై, శాంతమై,
ఆమోదావహమై, నిజానుభవవేద్యంబై, అనేహోదిగా
ద్యామేయ ప్రవిబోధ రూపమహితంబై యొప్పు తేజంబు, ప్రా
పై మీకున్ సిరులిచ్చుతన్ సురభిమల్లా! నీతివాచస్పతీ!”

అట్లు తనతండ్రి కంకితముగా భర్తృహరిసుభాషితముల ననువదింపఁ జేయుటయే కాక సింగపట్టణక్షేత్రమున ‘నృసింహసాగర’మను గొప్ప తటాకమును, మంచాలకట్టగ్రామమున మాధవస్వామి దేవాలయమును, జటప్రోలునగరమున శివాలయమును శ్రీమాధవరాయలవారు కట్టించిరి. శ్రీయెలకూచి బాలసరస్వతీ మహోపాధ్యాయుఁడు బాలసరస్వతీయముయొక్క పీఠికాపద్యములలో ‘చంద్రాపరిణయాది సత్కృతిస్రష్టను’ అని తననుగుఱించి చెప్పుకొన్నందున, నతఁడే యాచంద్రికాపరిణయకర్త యై యుండునని కొంద ఱనుమానించుచున్నారు. అంతకుఁదప్ప మరియొక ఆధారములేని ఆశంకను చర్చించుట యుక్తము కాదని మానివేసితిని. ఇంతకుఁ బేరులోనే వ్యత్యాస మున్నదికదా!

అన్నలు, తమ్ములు రాజ్యభారమును వహించియున్నందునఁ గాబోలు మాధవరాయలు విద్యావంతుఁడై, తర్కవ్యాకరణాది శాస్త్రముల నభ్యసించి, బహుకావ్యవేదియై, సాహిత్యప్రియుఁడై, విద్వత్కవిగాయకుల సాహచర్యము గల్గియున్నందునఁ గావ్యరచనకుఁ బూనుకొని యతిప్రౌఢప్రబంధమైన ఈ చంద్రికాపరిణయమును రచించెను. తీరుబడితోఁ గూర్చుని, యత్యంతమైన సామర్థ్యముచేత, నీ ప్రబంధమునందలి యొక్కొక్కపద్యమును వ్రాసి తద్జ్ఞులకు వినిపించుచు, వారు ఆహా! ఔరా! యెంత బాగున్నది! యని మెచ్చుకొనుచుండఁగా నీకావ్యమును రచించుచుఁ బూర్తిచేసియుండు నని తోఁచును.