పుట:Chandrika-Parinayamu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“చెన్నాంబ, తిరుమలాంబ, మల్లాంబిక, అనంతమాంబిక” యను నలుగురు భార్యలు.

శా. ఆవామామదనుండు మల్లవసుధాధ్యక్షుండు దచ్చెన్నమాం
బావామేక్షణయందు రామవిభునిన్, మల్లావనీవల్లభున్,
శ్రీవాసేక్షణ! నిన్నుఁ, మల్లమయెడన్ గృష్ణాధిపున్, మేదినీ
రావున్ గాంచె, నచంచలప్రమదసాంద్రా! మాధవక్షోణిపా!

అను చంద్రికాపరిణయ పద్యమువలన ముమ్మడిమల్లభూపాలునికి చెన్నాంబ యను భార్యయందు రామరాజు, మల్లనృపతి, చంద్రికాపరిణయకర్త యగు మాధవరాయలును జన్మించిరనియు, మల్లాంబికయందు కృష్ణభూపాలుఁడు, మేదినీరావు అను నిద్దఱు కుమారులు గల్గిరనియుఁ దెలియుచున్నది. కాఁగా వీరు సోదరపంచకముగా నుండి మాధవరాయల కిద్దరన్నలును, ఇద్దఱుతమ్ములును నుండిరని విశదమగుచున్నది. వీరిలోని మల్లనృపతిని వర్ణించుపట్టునఁ జెప్పిన ‘అనుపమ మల్లికార్జున యశోంచితుఁడైన కుమారమల్లనావనిపతి’ యను పద్యభాగమువలన నీవంశమువారికి శ్రీశైల మల్లికార్జునస్వామి యిష్టదైవమై యుండినట్లు తెలియుచున్నది. అందువలననే వీరిలో బెక్కండ్ర నామధేయములు పెదమల్లభూపాలుఁడు, చినమల్లభూపాలుఁడు, లింగభూపాలుఁడు, లింగాంబిక మొదలగు రీతిగా నుండుటకుఁ గారణమైనది. రేచర్లవారందరికినిఁ గూటస్థుఁడుగా భావింపఁబడుచున్న అనపోతమహారాజు శ్రీశైలమునకు సోపానములు గట్టించినట్లు ‘యశ్చారు సోపానపథేన చక్రే శ్రీపర్వతం సర్వజనాంఘ్రిగమ్యమ్’ అని రసార్ణవసుధాకరమునఁ గల శ్లోకభాగమువలన పైవిషయము దృఢీకృత మగుచున్నది. తరువాతి కాలమున నీరాజులు వైష్ణవభక్తులు నై సర్వమతసామరస్యమును బాటించిరి.

పై ముమ్మడి మల్లభూపాలుఁడే చంద్రికాపరిణయకర్త యగు మాధవరాయలకుఁ దండ్రి. తండ్రియగు మల్లభూపాలునిపై విశేషమైన భక్తి గలిగియుండిన సురభిమాధవరాయలు భర్తృహరి సుభాషితశతకత్రయిని ‘మల్లభూపాలీయము’ అను పేరున నాంధ్రీకరింపు మని మహోపాధ్యాయ యెలకూచి బాలసరస్వతికవిని ప్రార్థించుటయు, నతఁడు దానిని మల్లభూపాలున కంకితము చేసి ‘సురభిమల్లా నీతివాచస్పతీ!’, ‘సురభిమల్లా మానినీమన్మథా!’, ‘సురభిమల్లా