పుట:Chandrika-Parinayamu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జటప్రోలు సంస్థానమువారన్న వ్యవహారము నైజాం రికార్డులలోను కొంతవరకు ప్రజలలోను నేటికిని నున్నది. పై మూలపురుషుని గురించి యొక పూర్వకవి యిట్లు వ్రాసెను.

ఉ. శ్రీలలరంగఁ బాండ్యగజసింహుఁడుగా నచలంబు పెంపునన్
లాలిత పట్టభూషణ లలాటము సూరనరేంద్రు మాధవుం
డాలములోన నశ్వమున కాదటఁ బెట్టినఁ జెల్లుఁగాక తా
జాలిని బూని యబ్బిరుదు చయ్యన నన్యులు పెట్టఁ జెల్లునే?

ఈమాధవుఁడే మాదానాయఁడు. ఇతని తండ్రిపేరు ఎఱ్ఱసూరానాయఁడని యీపద్యము తెల్పుచున్నది.

(వెలుగోటివారి వంశ చరిత్ర. పుట 75)

అతని తరువాత పదునాల్గవతరమువాఁడైన (14) మల్లానాయఁడు లేదా కుమార మాదానాయఁడు క్రీ.శ.1527లో ఆనెగొంది రామదేవరాయలవలన జటప్రోలు సంస్థానమును పారితోషికముగఁ గొని, విజయనగరసామ్రాజ్యమునకు సామంతరాజై యేలుబడిని సాగించెను. జటప్రోలు నగరమునందు మదనగోపాలస్వామి దేవాలయమును గట్టించి, స్వామిని ప్రతిష్ఠించి, పక్షోత్సవ, బ్రహ్మోత్సవాదుల నేర్పాటు చేసెను. ఆయన తరువాత పెద్దినేఁడు పదునైదవతరము (15) వాఁడు. ఈ పెద్దినేనినే, చంద్రికాపరిణయము ‘పెద్దశౌరి, పెద్దవసుమతీకాంతుఁడు, పెద్దనృపతి’ యని పేర్కొని, యతఁడు గొప్ప పరాక్రమశాలియగు అశ్వరేవంతుఁ డనియు, సర్వజ్ఞసింగభూపాలుని వంశమున నుద్భవించిన సురభివారి మూలపురుషుఁ డనియుఁ జెప్పుచున్నది. ఇచ్చట మాదానాయనిఁగాక పెద్దినేనిని శాఖామూలపురుషునిఁగాఁ బేర్కొనుటకు గారణము చంద్రికాపరిణయరచనాకాలమున లభించిన శాసనాద్యాధారములై యుండునని యూహింపనగును. ఆ పెద్దనృపాలునికి వల్లభాంబ యను పత్నియందు మల్లనాయఁడు జనించెను. ఇతఁడు జటప్రోలువారి పూర్వులలో మొదటి మల్లభూపాలుఁడు. ఇతనికిఁ జెన్నాంబయందుఁ బుట్టిన కుమారునికిఁ బెద్దమల్లానాయఁడని నామధేయము (ఇతఁడు రెండవ మల్లభూపాలుఁడు). ఇతఁడు మహాపరాక్రమశాలియు, దాతయు నై యుండినట్లు చంద్రికాపరిణయము వర్ణించినది. ఈ మల్లానాయని కుమారుఁడును మల్లభూపాలుఁడే (ఇతఁడు ముమ్మడి మల్లానాయఁడు, ఈపేరుగలవారిలో మూఁడవవాఁడు). ఇతనికి