పుట:Chandrika-Parinayamu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ. సరసతరోక్తి నమ్ముని సుచంద్రసమాఖ్య రహించుభూపతిం
బరిణయ మందు మంచు సకిఁ బల్కెఁ దదాఖ్య రహించుమేదినీ
శ్వరమణి వీవె కాన నలసారసలోచన ని న్వరించు న
ప్పరమయతీశువాక్తతి యపార్థతఁ గైకొనునే మహీస్థలిన్. 32

మ. అని యిట్లాత్మకథాప్రవృత్తి కలవాహాస్యుం డుపోద్ఘాతవ
ర్తన రాజిల్ల వినిర్మలోక్తిచయధారం జంద్రికాసుందరీ
జననైకక్రమ మంతయుం దెలుప నిష్ఖండైకతానాత్మచే
విని యాశ్చర్యసమగ్రతం బెనిచెఁ బృథ్వీభర్త చిత్తంబునన్. 33

శా. పాంచాలీవరవిభ్రమశ్రవణసంపద్రేఖనో, మాన్మథా
భ్యంచచ్ఛాంబరికా సమున్నతినొ, పూర్వాదృష్టసంభూతినో,
మించెం దన్మహిపాలహృత్పదవి నిర్మేయస్థితిం బూను త
త్పంచాస్యోపమమధ్యమాకులమణీభవ్యానురాగాళికల్. 34

తే. కలితమానసకైరవం బలరఁ జంద్రి
కావిలాసంబు వినిన భూకాంతమౌళి
కపుడు నేత్రచకోరంబు లమితమోద
మొదవఁ దిలకింప లాలసం బుదిత మయ్యె. 35

క. ఈకరణి మదిం దద్రజ
నీకరముఖిఁ గాంచువాంఛ నిక్కం ధరణీ
లోకరమాసుతుఁడు మధు
శ్రీకరవాక్పటిమ యక్షశేఖరుఁ బలికెన్. 36

ఉ. ధీరవరేణ్య! నీ విపుడు దెల్పిన నిర్మలచంద్రికోదయో
దారసుధారసంబు మది కప్రమితప్రమదంబు నించి, యెం
తే రచియించె నవ్వనజనేత్రఁ గనుంగొన నూత్నలాలసా
పూరము గానఁ జానఁ గనఁబోవుద మాస్పద మావహిల్లగన్. 37