పుట:Chandrika-Parinayamu.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. శుభకలాపాప్తి మించుమయూరి ఘనపోష్య
కోటిలోఁ దొలుదొల్తఁ గొమరు గాంచె,
నఖిలశిరోధార్యయైన యుదీచ్యసం
తతి స్వవాలాఖ్యానగతి రహించె,
నతనుగుణస్ఫూర్తి నలరుహిందోళౌఘ
మనివారితాళితావ్యాప్తి నెనసె,
వరరసోన్నతి నొప్పు వర్షుకాంభోదజా
తము సుమనోహితత్వమున వెలసె,

తే. నైన భాస్వత్సహాయత స్వాంతసీమ
నించు కంతయుఁ గోరక మించుతమము
తరుణి కైశ్యంబుతో విరోధంబు గాంచి
చిత్రము మహానిశోదయశ్రీల మనుట. 28

మ. అలరుంగల్వలనీటు, మంచుజిగియొయ్యారంబునుం, దమ్మిమొ
గ్గలచెల్వంబును, గెంపుదామరల చొక్కాటంపుటందంబు, రి
క్కలడాల్ పెంపును, మించ నిచ్చెలువురేఖం బొల్చు నాశ్యామ ని
ర్మలరక్తిం గన రాట్సుతేక్షణచకోరంబుల్ ముదం బూనవే. 29

శా. ఆవామేక్షణవిభ్రమస్ఫురణమా యాతన్వియొయ్యారమా
యావామామణిచారుదీప్తిచయమా యాకొమ్మసౌందర్యమా
యావక్రాలకసత్కళావిభవమా యాలేమబిబ్బోకమా
భావంబందు నుతింప నల్వ వశమా పద్మాప్తవంశోత్తమా! 30

చ. అలఘుమనోభవోదయకరాంగయుతిం దగు నామిళిందకుం
తల, నలమీననేత్ర, నలతామరసానన, నాపికారవో
జ్జ్వలవరమంజులాబ్జగళసంగత, నాబిసబాహ, నాప్రవా
ళలలితపాద, నాచెలిఁ దలంపఁగ నీకెతగు న్నృపాలకా! 31