పుట:Chandrika-Parinayamu.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ. అనఁ గుముదుండు వల్కు వసుధాధిప! నీశుభరూపరేఖికల్
గనుఁగొనుమాత్ర నామహిపకన్య యెద న్నినుఁ జేర్చి దా వరిం
చు నిది నిజంబు కంజముఖిఁ జూడఁగ రమ్ము మదభ్రయాన మీ
వనువుగ నెక్కి యంచు నతఁ డయ్యెడ దానిఁ దలంచె నంతలోన్. 38

చ. బలువగు విస్మయంబున నృపాలుఁడు గన్గొనఁ జెంత నిల్చె ని
ర్మలధనరాజపుష్పకసమానము, సద్వలభీతసుప్రభా
గిలితదినేశమానము, వికీలితచారుమణీవితానకో
జ్జ్జ్వలరుచిరోచమాన, మలవాహముఖేంద్రవిమాన మయ్యెడన్. 39

చ. నిలిచిన యవ్విమాన మవనీపతిచంద్రుఁడు మిత్త్రయుక్తుఁడై
యలధనదాభ్రయానము ధరాత్మభవాపతివోలె నెక్కి ని
స్తులరయసంగతిం జనియెఁ దోడ్తఁ దదర్వముఖాన్వయాధిరా
ట్కలితమహాత్మభావగతిఁ గన్పడకుండఁ బరాళి కత్తఱిన్. 40

మ. వనితాదర్శనదోహదాతిశయధావత్స్వాంతరంగాగ్రవ
ర్తనకన్న న్మునుమున్న యేగు మయుసమ్రాడ్వ్యోమయానంబునన్
జననాథేంద్రుఁడు వేడ్కతోఁ జనియె వీక్షాలక్ష్యతం బూన దా
వనికాయంబులు పట్టణంబులు నదీవారంబు లందంబుగన్. 41

చ. చని చని తత్తరోమహిమఁ జయ్యన నాక్షణదోదయక్షమే
శనగర మప్పు డబ్బుర మెసంగఁ గనుంగొని యంతఁ జంద్రికా
వనజముఖీవిలాసవనవాటికఁ దత్తిలకామ్రకుందచం
దనసుమవాసితానిలవితాన మెదుర్కొనఁ జేరి యచ్చటన్. 42

చ. హరిముఖనేత సూప వసుధాధిపచంద్రుఁడు గాంచె ముంగలన్
హరినిభమధ్యమన్, హరికరాదృతశంఖసమానకంధరన్,
హరిజయశాలివాణి, హరిదంశుకవైరిశరాససుభ్రువున్,
హరిణసపత్ననేత్ర, హరిణాంకముఖిన్, హరినీలకుంతలన్. 43