పుట:Chandragupta-Chakravarti.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

చంద్రగుప్త చక్రవర్తి


మేనెల మొదలుకొని క్రీ. పూ. 324 వ సంవత్సరము మేనెల వరకును అనఁగా మూడు సంవత్సరముల కాలము పంజాబ్ సింధు దేశముల యందుండి చిన్న చిన్న రాజ్యము లనేకములు జయించెను, ఇతనికిఁ దమంతట వశులయిన గొప్ప రాజులలో మొదటివాఁడు తక్షశిలా నగరాధీశ్వరుఁడు. తక్షశిలారాజ్యము సింధూ జీలమ్‌నదుల నడుమనుండి పూర్వము మిక్కిలి విఖ్యాతి వడసి యుండెను. బౌద్ద కాలమునందు తక్షశిలా (రావల్ పిండి) నగరము సకల విద్యలకుఁ బుట్టినిల్లై యొప్పెను. అలెగ్జాండర్ సింధునదికిఁ దూర్పున విడిసియుండగనే తక్షశిలారాజగు ఆంభీ అనువాఁడు ఏడువందల గుజ్జములును, ముప్పది యేనుఁగులును, మూఁడువేల బలిసిన ఎద్దులును, పదివేల బలిసిన గొఱ్ఱెలును, కానుకఁగా దీసికొనిపోయి అలెగ్జాండరు శరణుఁజొచ్చెను. ఇట్లు పంజూబు దేశమందలి యొక గొప్పరాజే అలెగ్జాండరుకు వశుఁడైనందున నతని సాహాయ్యమువలన నలెగ్జాండరు పెక్కు స్వదేశీయ రాజుల నోడింపఁ గలిగెను.

అలెగ్జాండరు సింధు నదముమీఁద ఓహింద్ అను స్థలము నొద్ద నావలతో వంతెనకట్టి దాఁటి తక్షశిలా రాజ్యమునకు వచ్చి అచ్చటి రాజువలన మిక్కిలి గౌరవమందెను. అట నుండి యాతఁడు తక్షశిలా సైన్యములనుగూడ వెంటఁబెట్టుకొని పోరస్ రాజ్యముమీఁదికి దండెత్తివెళ్లెను. జీలమ్ చీనాబ్ నదుల నడుమ పోరసులను పౌరుష పథాను లప్పుడు రాజ్యము చేయుచుండిరి. గ్రీకు చరిత్రకారులు ఈ రాజుల పేరు పోరస్ అని వ్రాసిరి. ఈ పదము పౌరవపదద్యోతక మని కొందఱును