పుట:Chandragupta-Chakravarti.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

చంద్రగుప్త చక్రవర్తి


నీ యుపాయము వలన పర్వతరాజు నొద్దకు విషకన్యను బంపినవాఁడు చాణక్యుడన్న యపవాదము తొలఁగి ఆ కన్యను రాక్షసుఁడే బంపెనన్న జనశ్రుతి పుట్టెను.

చాణక్యుఁడు పట్టణమునందంతటను తన చారుల నంపి నందపక్షపాతు లెవ్వరెవ్వ రెచ్చటనున్నది కనుగొనుచుండెను. ఒక చారునివలన నమాత్య రాక్షసుని భార్యాపుత్రాదులు పాటలీపురములోనే యొక సెట్టి ఇంటనున్నారని తెలిసికొనుటయే గాక రాక్షసుని చేతిముద్రికయు సంపాదించెను. ఆ ముద్రికా సాహాయ్యము వలన నాతఁడు కొన్ని కాగితములు సృష్టించి మలయకేతువునకును రాక్షసునకును వైరము కలుగునట్లు చేసి వారి దాడిని వ్యర్ధపుచ్చెను. ఇట్లు రాక్షసుఁడు చేసిన పరశిక్షణోపాయముల కెల్ల చాణక్యుఁడు తగుపాటి ప్రతివిధానముల నేర్పఱచి రెప్పవాల్పక చంద్రగుప్తుని రక్షించుచుండెను. నందాదు లందఱు మృతినొందినను వారియెడ భక్తి విశ్వాసములు గలవాఁడై వారి శత్రువుఁడైన చంద్రగుప్తు నెట్లయిన సంహరించి తన మృతస్వాములకు తృప్తింగలుగఁ జేయవలెనని యమాత్య రాశుసుఁడు పట్టు విడువకుండెను. అమాత్య రాక్షసునివంటి మంత్రి చంద్రగుప్తుని కబ్బినయెడల నతఁడసామాన్య వైభవ శాలియగునని యెంచి రాక్షసున కెన్నియో యాశలు చూపి చాణక్యుఁ డతని వశపఱచుకొన నెంచెనుగాని యా స్వామిభక్త పరాయణుఁడు లోఁబడిన వాఁడు కాఁడు. తుదకు నీ క్రింది యుపాయముచే రాక్షసుని వశపఱచుకొనెను,