పుట:Chandragupta-Chakravarti.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

చంద్రగుప్త చక్రవర్తి


లేక వారు అనవసరమగు నష్టము పొందక యియ్యగలిగినంత యిచ్చినను ఇయ్యవచ్చును." అని వ్రాయఁబడి యుండుటంజేసి చంద్రగుప్తుని కాలమున రైతున కీయశక్యముగాని పన్ను రాజడుగ కుండెననుట స్పష్టమగుచున్నది. స్వంతముగ చెఱువులు ద్రవ్వించుకొనినచో నట్టి ప్రజ యా చెఱువుల క్రింది సాగుపై యైదు సంవత్సరముల కాలమును, శిథిలమైన చెఱువులను చక్కఁజేసికొనువారు నాలుగు సంవత్సరముల కాలమును, చెఱువుల విస్తీర్ణ మెక్కుడు చేసికొని యెక్కుడు భూభాగమును సాగుదల క్రిందికి తేఁ దలఁచుకొనిన వారు ఆ భాగము పయి మూఁడు సంవత్సరముల వఱకును, కుష్కీ పంటల పండించు నుద్దేశముతో క్షేత్రముల సిద్దపఱుచు కొనువారు రెండు సంవత్సరముల పర్యంతమును బన్ను చెల్లించ వలదనియుఁ జేయఁబడిన నియమములు పన్ను గ్రహించుటలో రాజునకుఁ గల దూరదృష్టిని వేనోళ్లఁ జాటుచున్నవి.

ఇంతవఱకు వ్రాయఁబడిన తరములు "ఉదక భాగము" లని పేర్కొనఁ బడినవి. అనఁగా నివి పల్లపు భూములమీదిఁ తరములని యర్థము. మెట్టభూములపై విధింపఁబడుచుండిన తరములను గుఱించి కనుగొనుటకు ఆధారమెద్దియుఁ గానరాదు.

రాజునకు స్వంతమాన్యము లనేకము లుండెడివి. వాని నాతఁడు "సీతాధ్యక్షుఁ " డను నధికారి మూలమున సాగు చేయించు చుండువాఁడు. ఈ యధికారి ‘కృషితంత్రగుల్మ వృక్షాయుర్వే దజ్ఞుఁడుగ' నుండును. అతఁడు రాజుగారి