పుట:Chandamama 1948 01.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎప్పటిలాగే అయిదుగురు గంధర్వులూ అటుగా వెళ్ళుతూ సున్నిఉండల వాసన పసికట్టి మూటవిప్పి చూశారు, "ఒకసారి పెట్టె ఇస్తే తృప్తిచెందక వీడు మళ్లీ వచ్చాడు. చాలా ఆశాపాతకుడుగా ఉన్నాడే" అనుకున్నారు. మినపసున్ని ఉండలు తిని వాటికి బదులు మరొక పెట్టె పెట్టి వెళ్లిపోయారు.

మర్నాడు సాయంకాలం వెదురు కిందికి వంగగానే అన్న మూట విప్పి చూసుకున్నాడు. మూటలో పెట్టెఉంది. తనపని నెరవేరిందిగదా అనే సంతోషంతో పెట్టెతోసహా యింటికి వచ్చి భార్యకు చూపించాడు. వారి ఆనందానికి మేరలేదు.

మరుసటి రోజున అన్నకూడా ఊళ్లో వాళ్లనందరినీ విందుకు పిలిచాడు. అందరూ వచ్చి బంతులు తీరి కూర్చున్నారు. అన్న జాగ్రత్తగా పెట్టె మూత తెరిచాడు. తెరిచేసరికి అందులోనుంచి అతిధికి ఇద్దరేసి మంగళ్ళు పొదులతోసహా బయటికి వచ్చారు. ప్రతి అతిధినీ ఒక మంగలి గట్టిగా పట్టుకుంటే రెండో మంగలి తల నున్నగా గొరగసాగాడు. కొద్ది సేపట్లోనే అందరి తలలూ బోడిగుండ్లు అయాయి. తర్వాత మంగలి వాళ్లంతా పెట్టెలోకి తిరిగివచ్చి మాయమయ్యారు.

ఆరోజు ఆవూళ్లో అన్నను తిట్టని వాళ్ళులేరు. అతను ఆలస్యం చెయ్యకుండా తనకు దొరికిన పెట్టెను సముద్రంలో పారేయించి తన అత్యాశకు తగిన ప్రాయశ్చిత్తం జరిగిందని తెలుసుకున్నాడు.