పుట:Chakkatladanda.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

  


సీ॥ అచ్చి అచ్చలకెక్కునని బుచ్చి పెండ్లాడ | బుచ్చి మిండలవెంట బోవమరుగు
తోటాకు పసరంచు దోసకాయను తిన్న | దోసకాయది జల్బుచేసి విడుచు
కోడూరు బురదని మేడూరు బోయిన |మేడూరిలో జాస్తి మెట్టశిస్తు
జక్కిదాణాకోడ స్వారెక్క పూనిన | బోయి బత్తెములకే పోవుగడన

గీ॥ కొంచెమిబ్బంది కలదని క్రొత్తబూని | ప్రాత విడిచిననది దాని తాతయగును
అని పలుకు . . . . . 76

సీ॥ మాఱ్చజాలక నేల మంటిలో బ్రాతిన| రూక కంటెను బుచ్చుపోక హెచ్చు
కట్టజాలక మూలబెట్టెలో దాచిన | చీరకంటెను గోగు నారబాగు
అన్నెంబు పున్నెంబు సరయజాలక పెంచు | మేను కంటెను ద్రోలు జీను మేలు
మోహరించిన జోదుమూక జూచిన బారు| రౌతు కంటెను దున్న పోతు మిన్న

గీ॥ కలిగి యున్నది నలుగురు గాంచి మెచ్చ|నక్కఱకురాని దున్న లేనట్టే సుమ్ము
అని పలుకు . . . . . 77

సీ॥ కఱచిన వేపి కాల్గఱను వాడుండునే |కాక ఱాకును డబ్బు గట్టుగాక
దోచిన దొంగ యిల్దోచు వాడుండునే | అచ్చలో ఫిర్యాదు దెచ్చుగాక
కుట్టిన తేల్కొండి కుట్టు వాడుండునే | గచ్చగందము రాచి కాచుగాక
పట్టిన దెయ్యంబు బట్టు వాడుండునే|గాలి బూదిడియాన గట్టుగాక

గీ॥ చెడుగు చేసినపని జేయ జెరుపుబోదు| చేయవలసిన పని జేయ జెందుమేలు
అని పలుకు . . . . . 78

సీ॥ కొమ్ముకోతిని నెరుంగుదునన్నవాడు రెం| డన్న నేమవి పదాఱన్న నేమి
తనతల్లి గొడ్డురాలని వాడది పెద్ద |దన్ననే మైదేండ్ల దన్న నేమి
పనస పూచేనని చెప్పినవాడు వేరున | నన్ననే మాకుల నన్న నేమి
యినుము బంగరు జేతుననిన వాడఱగాంచి | యన్న నేమది కాచ కన్న నేమి
అని పలుకు . . . . . 79

గీ॥ దబ్బరల బన్నుగడ సేయు ధగిడి కొడుకు | దొక్కదబ్బర చాలదే తక్కు విడువ

సీ॥ ఏగాని సొఱ బుఱ్ఱ కాగానె రచ్చల | గాణ బాడగవీణె కాయగాదె
అడవిలో బెరిగినదై నంతనే మద్ది | కొయ్య రాగద్దియ కోళ్ళుగాదె
యడుసులో బెరిగిన యంతనే నెత్తమ్మి | దేవేరికెంగేల దివియరాదె
పులిమేయు మెకముతోకలనున్న సివిరి | రాయల వింజామరమ్ముగాదే

గీ॥ మొదల దానెంత కొలదియై యొదవి యున్న | నక్కరకువచ్చుపనిబట్టి యెక్కుడగును
అని పలుకు . . . . . 80