పుట:Chakkatladanda.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

  


సీ౹౹ ఎలుకలల్లరిచేసి చెలఱేగినంతనే| పెణకచూరున నిప్పు బెట్టునెవడు
పంట కాలువ లోతుబారే దాటుట కంచు | కట్టల్కతో నెండగట్టు నెవడు
జలుబు చేసిన జీద జాలనటంచును | ముక్కు గోసికొనెడి మొప్పెయెవడు
పసి పాపలకు జంటి పాలు చాలవటంచు | మేలైన యాలిబోద్రోలు నెపడు

గీ॥ కొద్ది జబ్బొండు గలదని గొప్పదాని |మొదలు చెడ గొట్టుకొనువాడు మొదలెచెడున
అని పలుకు . . . . . 61

సీ౹౹ పాలు మంచివి యెన బాసెంబు మంచిది | గాలి మంచిదియైన గాఱునుంచి
పోగు మంచిదియైన బుట్టంబు మంచిది | పొదుగు మంచిదియైన మొదవుమంచి
బసిడి మంచిదియైన బట్టెడ మంచిది |నీరు మంచిదియైన నేరు మంచి
మాట మంచిదియైన మరియాద మంచిది | యీటె మంచిదియైన బోటు మంచి

గీ॥ మంచిగోరిని వాడెప్డు మంచిదై న | పని యొనర్పక యూఱ కేర్పడదు మంచి
అని పలుకు . . . . . 62

సీ౹౹ తన కొంప దక్క నందరి కొంప లురలంగ| చెడుగు మానిసికోరు జిల్లి పిడుగు
తన పైరు తడిసి యందరి పైరు లెండంగ | చెనటి వా డాసించు జెదురు మబ్బు
తన యింటనుండి యందరి యింట లేకుండ | తుంటరి తలపెట్లు గుంటి లచ్చి.
తనమేలె చూచి యందరి మేల్కనక యుండ | కొంటె యూరయు మెల్ల కంటి వేల్పు

గీ॥ ఎల్లరకు మేలుగోరుట చెల్లుగాని | తనకే కాపలెననుకొన్న దరమె పడయ
అని పలుకు . . . . . 63

సీ౹౹ కప్పగంబము చేరి కౌగలించిన గూట | ములు లేనిదే బిడ్డ కలుగబోదు
గాము గంగక మీదు గట్టినంతనే తిండి | తినకున్న నాకలి తీరబోదు
పడమటి దెసనుండి బల్లి పల్కంగానె | దొర జూడనిదె కొల్వు దొరకబోదు
చందురుండును బ్రోద్దు చాలి యుండంగానె |పడుచునాడక పెండ్లి నడవబోదు

గీ॥ సామిగొల్చిన సగినము ల్చక్కనైన |తనదు పూనిక లేనిదే పనులు గావు
అని పలుకు . . . . . 64

సీ౹౹ పాలు పిండెడి గొల్లవాని జూడంగానె | పంచడిల్లదె మంచి పాడి మొదవు
కాసు విడుచు నీటుకాని జూడంగానె | కన్నులార్పదె వెలవన్నె కత్తె
మేసి వచ్చిన తల్లి మేక జూడంగానె| చిట్టాడికూయవే చిరుత బొదులు
మదికి నిలవగు చందమామ జూడంగానె | పొంగాఱదే మిన్ను ముట్టి కడలి

గీ॥ తనకు మేల్చేయు వారం గనిన నొక్క డుబ్బి చెలరేగనట్లుగా కున్నలేదు
అని పలుకు . . . . . 65