పుట:Chakkatladanda.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈ చిన్న పుస్తకము పేరు "చక్కట్ల దండ ఈ పేరు అచ్చతెలుగు మాటలతో గూర్చబడినది. ఈ గ్రంధము సంస్కృతి సమములు అనగా తత్సమపదములు చేరకండ వ్రాయబడినది. కావున దీని పేరు అట్లుగానెయుండుట యుక్తమని యేర్పరుపబడినది. చక్కట్లు = లౌకికనీతులు; దండ= మాలిక కావున లౌకిక నీతిమాలిక యను నర్ధమిచ్చుచున్నది. ఇది నూరు సీసపద్యములు కలదయి యున్నది. ప్రతి పద్యము యొక్క తుదను గీతచరణములు రెండుమాత్రము అన్ని పద్యములకు సమానము. అవి యేవనగా "అనిపలుకు దానురాముడిట్లచ్చతెనుఁగు|కబ్బమందము నిండ జక్కట్ల దండ|". ఈ గ్రంధమును సులభ శైలిలో వ్రాయుటయేకాక లోకానుభవమువలన మనకు దెలియుచున్న వస్తువులు వాని గుణములు క్రియలు మాత్రమే దృష్టాంతములుగా గయికొనబడినవే కాని దేవతలు పిశాచములు రాక్షసులు స్వభావ విరుద్ధములై గ్రాంధికములయి కనుపట్టినవి దృష్టాంతములుగా జేకొనబడలేదు. కాని మొదటి పద్యమునందు దేవతాస్మరణము నుద్దేశించియు పదునొకండవ పద్యము యొక్క 1.3.4 పాదములయందు హిందూ దేశవాసులు సుప్రసిద్ధముగా నెరిగి యున్నట్టి దేవతలు పేర్కొనబడిరి.

"డకినీ" భాషలోనుండి తెలుగులో వాడుకగానుండు పదములును ప్రకృతదేశాధీశులగు నాంగ్లేయుల భాషలోని పదములును అచ్చటనచ్చట సందర్భానుకూలముగా బ్రయోగింపబడినవి. వక్రగతులు ప్రక్రమభంగములును సాధ్యమయినవట్టు లేకుండునట్టు జాగరూకతతో వ్రాయబడినది ఇది జయసంవత్సర శ్రావణశుద్ధ ప్రతివత్తునాడారంభింపబడి శ్రావణ బహుళ పంచమీ జయవాసరమునాటి రెండుజాముల పగలింట ముగింపబడినది. హూణశకము 1894వ సంవత్సరము ఆగస్టు నెలయగుచున్నది. మొదటి వద్యములో బ్రహ్మదేవునకు బెమ్మయని పలుకబడినది. గ్రాంధికమగు తద్భవము బమ్మయయినను బెమ్మయనివాడుట గ్రామ్యములయందు బ్రసిద్ధమయి యున్నఁదునను తద్భవములకు లోకప్రసిద్ది ముఖ్య ప్రమాణమయి తద్విరుద్ధమగు శబ్దజ్ఞసమయము లేదు గావునను సందర్భమునందు శ్రావ్యముగా జూపట్టినందునను అట్లు ప్రయోగింపబడియె. రేఫ,శకట రేఫల వెధర్మ్యము లేదను వారి మతమే చేకొనంబడియె, సందర్భానుకూలముగు క్రొత్తపోలికలు దొరకని పట్టులమాత్రము పూర్వమునుండి ప్రసిద్ధిగావచ్చు పోలికలు వుచ్చుకొనబడియె. ఇవి గ్రంధమందంతటను పదిపండ్రెండుండును.

నుజనులు దోషములనుబోవిడిచి గుణములున్న యెడల వానికి మాత్రము సంతసించి నన్నుంధన్యుఁజేయగోరెద.

ఏలూరు,
21.6.1894

విధేయుడు

దాసు శ్రీరాములు