పుట:Bobbili yuddam natakam.pdf/96

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాంకము. 87

ముసే. - అవును సర్దార్ ; ఆలాగే జర్గింది.

బుస్సీ. - ఏమి రాజా ? ఇండ్లు కాలుచున్న మంటలను పెండ్లిబాణ సంచా అంటివే. ఎంత పాపాత్ముఁడవయ్యా !

రాజు. - [విసుగుతో] ఆ! నేనుమాత్రము చూచి చెప్పితినా యేమి ? ఊరక నన్ను పట్టుకొని సివాలు మాటమాటకు.

బుస్సీ. - రాజా ఈపాపము ఎవరి దయ్యా ?

రాజు. - ఏమి చేయను! మనదే.

బుస్సీ. - అది యె ట్లయ్యా, ఉమ్మడిమాటగా పలికెదవు ?

రాజు. - నాకు ఈజమీను వచ్చినది, మీకు పేష్కస్సుధనము వచ్చినది.

బుస్సీ. - లేదు, నీవు మమ్ము మోసము చేసితివి. నేను ఏత ప్పయిన మన్నింతును గాని, మోసమును మన్నింపను. హా ! హా ! ఎంత మోసపోయితిమి ! ఇందులకు శిక్ష రాజా, యీజమీనును మీకు మే మియ్యము.

రాజు. - [ఆత్మగతము] బెదరింపే. [ప్రకాశము] ఈపాపము నాయొక్కనిదే.

బుస్సీ. - అట్లు పలుకు. 'మనది' అనకు. [సూక్ష్మశ్రవణ మభినయించి] ఏమి యిది తెంపులేని ఘంటానాదమువలె వినఁబడుచున్నది! హైదరుజంగ్, మీకు వినఁబడ లేదా ?

హైదరు. - అదుగో యినండి. అరబ్బీరాత్రులకథల్లో కొండమీద్కి ఆబంగారపు వున్నికీ తేబోయేవాడ్కి రాయిరాయిన్ని 'చీచీ' యన్న చీవాట్లలాగ మనకీ యిక్కడ 'చీచీ' ఇనబడటం లేదా ?

ముసే. - అవు నవును. ఇంకా ఇంకా ఏమ్టేమ్టో ఇనబడతా వుంది.

హైదరు. - ఇప్పు డేమి చెప్తారు ? ఇంకా రాత్రియైనకొద్దీ కోళాహళం వుంటుంది. గుండెబద్దల్ అయ్యే షబ్దాలు ఇనబడుతుంది.

రాజు. - ఇన్ని చావులు అయిన యీ చోట శాకినీ డాకినీ బ్రహ్మరాక్షస బేతాళులు వేఁటలాడుట ఆశ్చర్యమా ?

హైదరు. - నేలదేకినీ, నింగినాకిని, జిన్, పిసాసీ, సైతాన్లు కూడా. ఈటి భయానికే నేను రాత్రి నాడేరాబైటికి అడ్గుపెడ్తాన్ లేదు.

బుస్సీ. - మనమిక్కడ ఉండఁ దగదు. డేరాలకే పోదము రండి. మనకే మందుగుండ్లు లేకపోయిన, మనది 174000 సేనయు, యీబొబ్బిలిబంట్లు 2000 మందిచేత నాశమై యుండును. [అందఱు పరిక్రమింతురు.]