అష్టమాంకము.
స్థలకము: - బొబ్బిలికోట లోపల.
(బుస్సీ, విజయరామరాజు, హైదరుజంగు, ముసేపనాల్, పరివారముతో ప్రవేశింతురు.)
హైదరు. - ఏమి ముసేపనాల్ బహద్దర్ ? ఈలూటిలో విస్తారం ధనం దొరికిందా మీకి ?
ముసే. - ఎక్కువగానే దొరికింది, హైదర్సాబ్. ఈయాశ్చర్యం ఇనండి. మాదీ పాడు జీవణం. వఖరిసావు మాకీ పెళ్లి వఖరినాశం మాకి హవిశ్యర్వం ;మాదీ చావూ నాశం అలాగే ఎవరికో పెళ్లి హవిశ్యర్వం అయితుంది. వారిధనం మొత్తంగా మాకి ఎక్కడా దొరకలేదు. బుగ్గిఐన వల్లుతో బంగారపు జవాహరీ కరిగినపెళ్లలు దొరికినయి. కొన్ని ఇస్త్రీ శపాల్మీద విశేషించి జవాహరీ దొరికింది. ఖిల్లామే ధనం దాశిన సోటు అడ్గడానికి వఖ నరపురు గయినా లేదు.
బుస్సీ. - స్త్రీ లే మయినారు ? ఒక స్త్రీయైనను కోటనుండి తప్పించుకొని పోలేదు గదా !
ముసే. - స్త్రీ లంతా సచ్చి పడివుంది. శానా మంది కాలిపోయింది.
బుస్సీ. - ఏమి యిది ! పెండ్లి యని చెప్పినాడే యీరాజు !
ఒకసిపాయి. - [సంభ్రాంతుఁడై ప్రవేశించి] నాకీ ఆయింట్లోదూరినదాన్కి కిఫాయత్ ఇద్గో నాదాడీ కాలిపోవడం. [అని నిష్క్రమించును.]
బుస్సీ. - ఏమిరాజా, యీవింతలు చూతము రండి [అని పరిక్రమింతురు.]
రాజు. - [ఆత్మగతము] నాచేఁతను నాకనులారం జూచెదఁగాక.
బుస్సీ. - [పరికించి] యీ యిండ్లన్నీ కాలిపోయినవి ! ఇంకను కాలుచునే యున్నవి ! [కాంచి] ఏమి యివి ! కాలిపోయిన స్త్రీ దేహములు ! [నిర్వర్ణించి] ఎక్కడను పురుషదేహము అగపడదు. [ఒండుచోఁగాంచి] హా! యిక్కడ ఈపసి కూన సోలి పడిపోయి, పాలు త్రాగు చున్నట్లు నోరు కదలించుచున్నది ! [మఱియొక చోటంగాంచి] హా ! హా ! ఇక్కడ ఈశిశువు చచ్చిన తల్లిమీఁద పడి పాలకై పీఁకు చున్నది ! హా ! హా! రాజా ! ఈకోటలోని స్త్రీ లందఱు నీవు చేసిన ద్రోహముచేత గోహారు చేసినారా యేమి ?