Jump to content

పుట:Bobbili yuddam natakam.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బొబ్బిలియుద్ధనాటకము. 74

బుస్సీ. - ఇక పర్వా లేదు. బొక్కపడక పోయినను, మనవీరులు లోపల ప్రవేశించి సర్వ సంహారము చేయుదురు.

తృ. - [ప్రవే.] ముత్యాల్ పాపయ్యా పట్టాకత్తి మన చండ్రోలు మహమ్మదుకీ కూడా లేదు. ఆ పాపయ్యచేతులో మన దూడూఖా న్మర్గయా ;దేదేఖాన్‌గయా ; దాడీఖాన్ గయా;ణాణాబాయి, గుగ్గుమియా, లడ్డుసాబు, బర్ఫీసుల్తాన్, పేపేపైల్మాన్, అందఱు సఫాయి.

[నిష్క్రమించును.

బుస్సీ. - ఎంత సాదనాలు చేసినవారయ్యా యీబొబ్బిలి బంట్లు !

చ. - [ప్రవే.] ముసేఫనాల్ హాతికి దిగి, లగ్గాకీ యెక్కి, పాపయ్యతో కలపట మైనాడు. ఆళ్లకి యిద్దఱికి తడాఖా, అందఱు లడాయి మాని చూస్తారు. ఇద్దఱున్నూ అంతర్పల్టీ, దొంతర్పల్టీ, నాల్గేసి హాకాశపల్టీ లేశి, పార్వాపిట్టల్లాగ, ఆణ్ని దాటి ఈడు, ఈణ్ని దాటి ఆడు, పోతాడు.

[అని నిష్క్రమించును.

బుస్సీ. - ఎంత సేపు ? ముసేఫనాల్ ఆలస్యం చేయఁడే;

ప్ర. - [ప్రవే. హర్షముతో] సర్కార్ సలామ్, ముసేఫనాల్ తన పేరు చెప్ఫి ముత్యాలపాపయ్యని పేగులు వెళ్లబొడిచినాడు. వాడు నారాయణ నారాయణ అంటా నేలకొరిగినాడు.

[అని నిష్క్రమించును.

బుస్సీ. - బళీ ! బళీ ! ముసేఫనాల్ !

తృ. - [ప్రవే. హర్షముతో] సర్కార్, ముసేపనాల్ వాళ్ల జెండా తీసి, మన జెండావేశినాడు. వాళ్ల నౌబత్తు తోసి మననౌబత్తు మోగిస్తా వున్నాడు.

[అని నిష్క్ర.

చ. - [ప్రవే.] అరే ! రే! రే! దొంగదారిని వచ్చినాడు రంగారాయడు ఆ బురుజుమీఁదికి ! పట్టాకత్తితో ఊడుస్తాడు బురుజంతా. ఆయన్కీ కోసం బలేకాగడాలు వేశినారు. 'బొబ్బిలియేటు సూడు, యెలమపోటు సూడు, రంగారాయడి రణరంగము సూడు.' అంటాయేస్తాడు. అంతా తిరువణ్ణామలె దీపోచ్చం అయింది. ఆయన షైమూం వున్యాడు సర్కార్ ! తుపాన్ వున్యాడు ! ఇక్డవున్యాడు ! అక్డవున్యాడు! ఇక్డ లేడు ! అక్డ లేడు ! అక్డా యిక్డా కూడా వున్యాడు! మల్లీ ఇందర్జాలం వున్యాడు, మల్లీ కంటికి హగ్పడ్తాడు, గుఱికి హగ్పడుడు. ఆయ్న ఎక్డ కన్పడ్తే అక్డ ఈరాజాగారి దం డంతా శరణు చెప్పేవాడు, దండం పెట్టేవాడు, దద్దిరిల్లి కందకంలో పడేవాడు. ఆయన సొంతచేతితో కత్తితో నరుకుతాడు ; గాలి నఱుకు తాడులాగ నరుకుతాడు. మంచి మంచి సిపాయి ఆయన్కి కొట్టడానికి పోతాడు, సలాం శేస్తాడు. ఆ షూర్మాన్ అద్మీ అద్మీకి గొంతు కోసి తల్లకిందు చేసి, నెత్తురువానలు కురిపిస్తాడు. నిలువు మొండ్యాలు ఆయన్కి చుట్టు ఔతుఖానాలు. అవే నెత్తురు చిచ్చుబుడ్లు ఆయన్కి చుట్టు.

[అని నిష్క్రమించును.