పుట:Bobbili yuddam natakam.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రవేశకము. 61

పౌరులు. - నిజమేనా నిజమేనా ? ఏ మాశ్చర్యము !

అప్ప. - అవుతే అబద్ధం చెప్పుతానా ?

పౌరులు. - అబ్బా ! యీళ్లచేత మనపని యేమౌద్దో గందా ?

పౌరులు. - వొళందు లన్నారే వొళందు లేంటయ్యా ?

అప్పన్న. - వాళ్లువొళంగులు - వొడ్రంగులు - అనగా కంసాల్లు సముద్రం కింద వూళ్లు, యిళ్లు, మైదానాలు, ఆకాశం, అన్నీ కట్టుకొని, తిమి తిమింగిలాల మందలని గేదెమందలలాగ పాడి చేసుకొంటూ, ఆపాలు బడబానలంలో కాచుకొని తాగుతూ, హాయిగా వుంటారు అందుకోసం వాళ్లకి వొళందు అని పేరు.

ఒక కుఱ్ఱవాడు. - [బ్యా అని యేడ్చుచు] నాకు బయ మేస్తావుంది. నన్నుమా యింటికాడికి తీసకెల్లండి.

[అని ఒక పౌరుని పట్టుకొనును.

ఆపౌరుడు. - తీసకెల్తాలే, మాకా డుండు, భయ ముండదు.

కుఱ్ఱ. - అబ్బా ! నానుండను.

[బ్యా అని యేడ్చుచు పరువున నిష్క్ర.

సన్నా. - బాగా నరుకుతావురా. మఱికొందరి పేరు పరంగు లన్నావే అదెందు కొచ్చింది ?

పొరులు. - కుఱ్ఱోడు యెల్లినాడు లెండి. మఱి శెప్పండి.

అప్ప. పిరంగీలు కాల్చడంలో అంతటి వాళ్లు మఱి లేరు. కడమవా ళ్లంతా తుపాకీలు యేలాగ యెత్తి రొమ్మున పెట్టుకొని కాలుస్తారో, వీళ్లు యెంత పిరంగీ అయినా అలాగే యెడమచేత్తో యెత్తి రొమ్మున బెట్టుకొని కాలుస్తారు. అదీ కారణం ఆపేరు రావడానికి.

పొరులు. - ఇంగిలీసు లేటండీ?

అప్ప. - వాళ్లమతంలో 'యెంజెల్సు' అంటే దేవతలు. వీళ్లు దేవతల అవతారమని ఆపేరు వచ్చింది. ఆలాగే వీళున్న చోట అధర్మం జరగ దంటారు.

పౌరులు. - మరి యీళ్లందఱు తెల్లగా వుంటారే,అదే మండీ?

అప్ప. - పూర్వము హనుమంతుడు మొదలయిన వానరవీరులు సీతాదేవిని చూచి వచ్చి మధువనంలో చొచ్చి తేనె లన్నీ తాగేసి, దధిముఖుణ్ణి అవమానపఱిచినప్పుడు అతడి మొఱ్ఱని సుగ్రీవుడు వినకపోతే, దధిముఖు డంటే అతని మొఘం పెరుగులాగ తెల్లగా వుంటుం దన్నమాట, అతను అలిగి దేశాలమీద పాఱిపోఁగా, అప్పట్నుంచి ఆదేశాలన్ని గడ్డగడ్డగానే, చెట్లు, చేమలు, కొండలు, అడవులు, ఆకాశం, నదులు, జీవరాసులు, అన్నీ కాలమానంతో కూడ, పెరుగుగడ్డలలాగ తెల్లబడి పోయినవి. వీళ్లు ఆదేశాల వాళ్లు.