పుట:Bobbili yuddam natakam.pdf/69

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

(చతుర్థ పంచమాంకముల నడుమ)

ప్రవేశకము.

(అంతట పలువురు పౌరులు ప్రవేశింతురు.)

ప్రథముఁడు. - ఒయ్యోయి సన్నాసీ, కోటలో నేమోయి చెవులు గింగు రనే లాగ యీరోజల్లా ఖణీల్ ఖణీలు ఖణీల్మని మోగుతూ వుంది ?

ద్వితీయుఁడు. - ఓహో అప్పడా ! మఱేమీ గాదు ; కత్తులు, కఠారీలు, ఈటెలు, బల్ల్యాలు, బాకులు, ఈలాంటి వన్నీ చికిలీ చేయిస్తూ వున్నారోయి.

అప్ప. - ఏమి చికిలీ అయినా చేయించేరుగాని, ఈకత్తులూ కఠార్లు, ఆ నల్లమందు మారెమ్మ ముందర అక్కరకు రావురా. నేను పెద్దలు చెప్పగా విన్నాను. కొన్ని విశేషాలు.

సన్నాసి. - నాకు చెప్పరా ఆవిశేషాలు.

అప్ప. - వినుమఱి. ఈ నల్లమందు మారెమ్మ అనే ఆమె కాళికాదేవి, అదే కాళరాత్రట. కాగానే మనకళ్లకి నల్లగా బొగ్గువర్ణంగా కనబడుతుంది. ఆమెకి కిట్టని వాళ్లు దగ్దిరికెళితే భగాలు మని మంట మండి అంతర్ధానమవుతుంది. వాళ్లు కాలి చచ్చిపోతారు.

సన్నాసి. - అవునురా, అవునురా.

అప్ప. - మఱి మన యీ దేశాల్లో నుంచి మంత్ర తంత్రాలకి పలాయమాన మై పోయిన భూత ప్రేత పిశాచ బ్రంహ్వరాక్షస శాకినీ ఢాకినీ కాకినీ ఠాకినీ పినాకినీ బడబాకినీ గోడదూకినీ పాడెపీకినీ నింగినాకినీ నేలదేకినీ నీడగోకినీ దయ్యాలు ఆమెకి పరివారము. అవి ఆమెతో కూడా యెప్పుడూ అంతర్ధానంలోనే వుంటవి. యుద్ధంలో ఆమెకి కిట్టనిపక్షం వాళ్లని తెలియనీకుండ మీదబడి చంపి రక్తం తాగేస్తవి.

సన్నాసి. - తినేస్తవట కూడా.

అప్ప. - అవును మఱి. మఱీ-ఆమెయెప్పుడున్ను పరంగు లింగిలీసులు వొళందులు బుడుత కీసులు సిద్దీలు వున్నారే, వాళ్ల పక్షము. ఆమె వీళ్లకి గొట్టాలూ వుండలూ యిస్తుందే అవే తుపాకులు ఫిరంగులూ యినపగుళ్లున్ను. ఉండలవెనక తానేవుండి వూత్తుంది.

పౌరులు. - ఈళ్లల్లో బుడతకీసు లన్నా వే అదేం పేరండీ ?

అప్ప. - వాళ్లు గుఱిగా చూస్తే బుడతలు, అనగా కుఱ్ఱవాళ్లు, కెవ్వున కేకేసి కీసుకీసుమంటా లగువు వేసి చచ్చి పడిపోతారు.