పుట:Bobbili yuddam natakam.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాంకము.

39

          సీ. లక్ష డెబ్బది వేల లష్కరుతోఁ బోరు
                  పిడికెఁడు మందికి బెడద గాదె?
              బెడిదంపుఁ బిడుగు లేసెడు ఘనాఘన మైనఁ
                  బెనుగాలి కెదు రెక్కి పెనఁగఁగలదె?
              ఒక్కఫిరంగికిఁ దుక్కు దుమారమై
                  మట్టిలోఁ గలియదే పుట్టకోట?
              విండ్ఁలు జువ్వలు మందుగుండ్లను గెల్చునే?
                  యౌటుబారుల కెన యౌనె దోంట్లు?

          తే. ఎరగలిం బడు మిడుతల కీడు గాఁగఁ
                  దెలిసియును గొదగొని పోయి పొలియుటయును,
              బాలవృద్ధుల సతులఁ దుపానులోని
                   పిట్టలను జేఁతయును, వెఱ్ఱిపట్టు గాదె? ౪౩
      అయ్యా,
          క. అల వచ్చినఁ దల వంపుము,
              పులి వచ్చినఁ జెట్టు నెక్కు, పోయిన దిగుమా! ౪౪

అన వినలేదా ? తుపానులో మహావృక్షములు నిట్ట నిగిడి వే రూడును, తుంగ వంగియుండి అనంతరము తల యెత్తును. మీకు, ఇపుడు, పోరాటమునకు కాలము గాదు, పెండ్లియుత్సవము లింకను ముగియలేదు.

          ఆ. రేయి గూబ వచ్చి మాయించుఁ గాకిని;
              పగలు కాకి గూబఁ బట్టి చంపు;
              కాలబలము; దీని గణుతించి పోరెడు
              వీరుఁ డెల్లయెడల విజయ మొందు. ౪౫

కాలానుకూల్యమును చూడవలయును గదా ? ఇప్పుడు ఈయవాంతరమును, ఎట్లయినను దప్పించుకొని యనంతరము గోలకొండకు తెలుపుకొని యపరాధులను దండన చేయింప వచ్చును. కనుక, నన్ను మీతమ్మునిఁగా భావించి నాప్రథమప్రణయమునకు భంగము చేయక, అతఁడు కోరిన యారెండుపనులను చేయుఁడు. క్షణముసేపు --కారి వెళ్లితి మని తలంపుఁడు.