పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64 బిల్వమంగళ [అం 3

సాధు - నాభావము నీకు బోధపడలేదు. అన్నమూ పానమున్నూ అరసి చూచునా?

దాసి - ఆ గోలేలేదు. ఏమి చేయదలచుకొన్నావు?

సాధు - అట్లైతే మరీమేలే.

దాసి - నీళ్ళు నమలక చేయదలచిం దేదో చెప్పు.

సాధు - పాలలో విషము కలిపితే?

దాసి - అమ్మయ్యో! విషమే! విష మెవరు పెట్టుతారు? నాచేతకాదు సుమా! నాపీకమీదికి తేవలెనని నీ యూహ!

సాధ్ - ఆలాగు కాదు. రాత్రి నదిలో స్నానముచేసి వచ్చును కదా? వంట చేయడము నీవే, ఆమె పిచ్చిది, అసలే తెలుసుకోలేదు; పాలలో కలిపిపెట్టి నీదారి నీవు పట్టు.

దాసి - నీ కనడము సులభమే, నాఒళ్ళు ఒడకుతూంది, ఆపని నాచేతకాదు. నాకు విషము దొరకడ మెలాగు?

పెట్టినప్పు డెవరికంటనైనా పడితే నన్ను రక్షించేవారెవరు? నా వల్లకాదు. సుమా.

సాధు - పిచ్చియెత్తినవాళ్ళు చచ్చుట మేలుకాదా?

దాసి - నీ వెంతచెప్పినా సరే, ఆపని నావల్ల కాదు.

(పిచ్చిది వచ్చును)

సాధు - (పొట్లముతీసి) ఇదిగోమందు, తీసుకొనిపోయి పాలలో కలుపు. ప్రాణము పోగానే పూడ్చివేతాము.