పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగులో వేమన శతకం, సుమతీ శతకం బాగా ప్రచారంలోకి వచ్చాయి. మనదేశంలోని ఈ నీతివాజ్ఞ్మయ శాఖలను అర్థంజేసికోవడానికి బైబుల్లోని విజ్ఞానవాజ్మయం కొంతవరకు తోడ్పడుతుంది.

2. బైబులు విజ్ఞానం మతపరమైంది. భగవంతుడు దాని కాశ్రయం. దైవభీతి విజ్ఞానానికి మొదటిమెట్టు అన్నాడు సామెతల గ్రంథకారుడు. నూత్నవేదంలో క్రీస్తు మనకు ఆదర్శజ్ఞాని. కాని మనదేశంలో పుట్టిన విజ్ఞానం కేవలం లౌకికమైంది. దానికి పరమాత్మునితో సంబంధంలేదు.

3. ఏ దేశాల్లో వర్ధిల్లినా విజ్ఞాన వాజ్మయం ప్రయోజనం ఒక్కటే. నరుడు తన దుష్టవర్తనాన్ని మార్చుకొని సద్వర్తనాన్ని అలవర్చుకొనేలాచేయడం. విజ్ఞాన వాజ్మయం అనే అద్దంలోకి చూచుకొని మన నైతిక రూపాన్ని మనం చక్కదిద్దుకోవాలి. ఈ పుస్తకంలోని 40 అంశాలూ ఇందుకు తోడ్పడేవే. మానవుడు విజ్ఞానం బోధించే ఆశయాలను సాధించడానికి జీవితాంతం కృషిచేస్తుండాలి.

భక్తుడు విజ్ఞాన వాక్యాలనూ సామెతలనూ వల్లెవేయడంతోనే సరిపెట్టుకోగూడదు. అతని జీవితమే ఓ విజ్ఞాన సూక్తిగా, ఓ మంచి సామెతగా రూపొందాలి. సజ్జనుడైన వాడే ప్రాజ్ఞడు.

ఈ గ్రంథంలో విజ్ఞానబోధలను 40 అధ్యాయాలుగా విభజించాం. రానున్న పుటల్లో వీనిని క్రమంగా పరిశీలించి చూద్దాం.

2. బహుమానాలూ, శిక్షలూ

నరులు చేసే మంచిపనికి దేవునినుండి బహుమతి లభిస్తుంది. చెడ్డపనికి శిక్షపడుతుంది. ఈ బహుమతినీ దండననూ ఎవడూ తప్పించుకోలేడు.

ప్రభువు కృపాకోపాలు రెండూ ప్రదర్శిస్తాడు
అతడు క్షమించడానికీ కోపించడానికీగూడ సమర్ణుడు
పాపాత్ముడు తాను దోచుకొన్నదానికి
శిక్ష అనుభవింపక తప్పదు
పుణ్యాత్ముడు పడిన శ్రమకూ ఫలితముంటుంది. - సీరా 16,12-13
ప్రకృతిశక్తులుకూడ దేవుని ఆజ్ఞకు లొంగి దుష్టులను శిక్షిస్తాయి.
నిప్పు వడగండ్లు కరవు వ్యాధి
నరులను శిక్షించడానికే సృజింపబడ్డాయి
కూరమృగాలు తేళ్లు పాములు దుష్టుల పనిబట్టే కత్తులు