పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బోధకుడు - 13, 52. అతడుశిష్యులకు వివేకాన్నిస్తాడు - లూకా 21,15. క్రీస్తు దేవుని వివేకం - 1 కొ 1,24. అదృశ్యుడైన దేవునియొక్క ప్రత్యక్ష రూపం. దేవుని సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు - కొలో 1,15. దేవుని మహిమయొక్క తేజస్సు ,దేవునికి అచ్చమైన ప్రతిరూపం - హెబ్రే 1,3. ఆదిలో విజ్ఞానం దేవుని చెంత వున్నట్లే, వాక్కుకూడ దేవునిచెంత వుంది - యోహా 1,1. విజ్ఞానం మానవాళిమధ్య వసించినట్లే క్రీస్తుకూడ తన వారి వద్దకు విచ్చేసాడు -1,11. ఈ నూత్నవేద వాక్యాలన్నీ కూడ క్రీస్తుపూర్వవేదంలోని విజ్ఞానమేనని రుజువుచేస్తాయి.

8. క్రైస్తవుడూ విజ్ఞానం

క్రీస్తు దేవుని విజ్ఞానమని చెప్పాం. అతని శిష్యులమైన మనంకూడ ఈ విజ్ఞానాన్ని పొందుతాం. తండ్రే దీన్ని శిష్యులకు అనుగ్రహిస్తాడు. "తండ్రీ! విజ్ఞలకు వివేకులకు ఈ రహస్యాలను మరుగుపరచి వీనిని పసిబిడ్డలకు బయలు పరచావు - మత్త 11,25. ఆత్మ మనకు విజ్ఞానపూర్వకమైన వాక్కును ప్రసాదిస్తుంది - 1కొ 12,8. ఈ విజ్ఞానం దేవుడు గోప్యంగా వంచిన క్రీస్తు మనుష్యావతార రహస్యం, పౌలు లాంటి అపోస్తలులు ఈ రహస్యాన్ని మనకు బోధించారు-1 కొ 2,7. అది మన నైతిక జీవితానికిగూడ గుర్తు. జ్ఞానియైనవాడు సత్ర్పవర్తనంద్వారా తన జ్ఞానాన్ని రుజువు చేసికోవాలి - యాకో 3,13. వివేకం లేనివాడు దేవుణ్ణి అడుగుకొంటే అతడు వానికి విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు - యాకో 1,5.

ఈ విధంగా పూర్వవేదంలో మొదట నీతిబోధలతో ప్రారంభమైన విజ్ఞానం క్రమేణ దైవభీతి ఐంది. తర్వాత దైవభక్తి ఐంది. నూత్నవేదంలో క్రీస్తు అయింది. కడన క్రైస్తవులు పొందే వరమైంది.

9. రోజువారి జీవితంలో విజ్ఞానం

1. బైబుల్లో సామెతల గ్రంథం, సీరా గ్రంథం మొదలైన సామెతల పుస్తకాలున్నాయి. కాని మనదేశ భాషల్లో ప్రాచీన లిఖిత సాహిత్యంలో సామెతల గ్రంధాలు లేవు. సామెతలు మన ప్రాచీన ప్రజల్లో ముఖతః మాత్రమే ప్రచారంలో వుండేవి. ఈ మౌఖిక లోకోక్తులను మనదేశంలో 20వ శతాబ్దంలో గ్రంథాలుగా ప్రచురించడం మొదలెట్టారు. ఇప్పుడు తెలుగు సామెతలు సంపూర్ణంగా గ్రంథరూపంలో దొరుకుతాయి.

ఒక్క సామెతలేగాకుండ మనదేశంలో విజ్ఞానవాజ్మయం బోలెడంత వుంది. నీతికథలు, నీతి శాస్త్రాలు, నీతి శతకాలు, పొడుపు కథలు మొదలైనవన్నీ ఈ శాఖకు చెందినవే. సంస్కృతంలో పంచతంత్రం, హితోపదేశం ప్రధానంగా విజ్ఞాన గ్రంధాలే.