పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విలువతో చూడాలి. కొందరు భ్రాంతపడినట్లుగా ఈ లోకం మాయకాదు. మనం లోకంలోని వివిధ రంగాల్లోకి ప్రవేశించి కృషి చేయాలి, విజయాలు సాధించాలి. ఈ లోకమంతా యిప్పడే ఉత్థానక్రీస్తు తేజస్సుతో భాసిల్లుతూంది. అతనివైపు ఆకర్షితమౌతుంది. మన శరీరంలాగే అదికూడ కడన మహిమను పొందుతుంది. ఈలాంటి లోకంలో జీవించడం భాగ్యం అనుకోవాలి. మనకు కర్మవాదం పనికిరాదు. నిరుత్సాహ భావాలు కూడవు. కష్టే ఫలి అని నమ్మాలి.

7.రెండవ రాకడ

క్రీస్తు లోకాంతంలో మళ్ళా రెండవమారు విజయం చేసి జనులందరికీ న్యాయతీర్పు తీరుస్తాడు. ఈ యధ్యాయంలో రెండంశాలు పరిశీలిద్దాం.

1. బైబులు భావాలు
1. రెండవ రాకడను గూర్చిన వేదవాక్యాలు

తొలిరోజుల్లోని క్రైస్తవులు క్రీస్తు మళ్లా తమ జీవితకాలంలోనే తిరిగివస్తాడని నమ్మారు. ఆనాటి క్రైస్తవ జీవితంలో ఈ నిరీక్షణం ముఖ్యాంశంగా ఉండేది. కాని వాళ్ళ భావించినట్లుగా ప్రభువు రెండవసారి తిరిగిరాలేదు. ఈనాడు మనం క్రీస్తు ఎప్పడో లోకాంతంలో తిరిగివస్తాడని ఎంచుతాం. అతడు మన జీవితకాలంలో రానేరాడని తలుస్తాం. కనుక "ఈనాటి మన నమ్మకం తొలిరోజుల్లోని క్రైస్తవుల నమ్మకానికి కేవలం భిన్నమైంది.

మార్కుసువార్త ప్రభువు రెండవరాకడను ఈలా వర్ణించింది. "మనుష్యకుమారుడు మహాశక్తితోను మహిమతోను మేఘారూఢుడై రావడాన్ని ప్రజలంతా చూస్తారు. అతడు దూతలను పంపి భూలోకంనుండి ఆకాశంవరకు నలుదిశలనుండి తానెన్నుకొనినవారిని ప్రోగుజేయిస్తాడు" 13,26-27. ఈ సంఘటనాన్నే పౌలు మొదటి తెస్సలోనీయుల జాబులో ఈలా వర్ణించాడు. "అపుడు ఆజ్ఞారావము ప్రధాన దేవదూత పిలుపు, దేవుని బాకాధ్వని విన్పిస్తాయి. ప్రభువు స్వయంగా పరలోకంనుండి దిగివస్తాడు. క్రీస్తుని నమ్మి మరణించినవారు ముందుగా పునరుత్ధానమౌతారు. పిమ్మట అప్పటికింకా సజీవులై ఉన్నవారు ప్రభువుని వాయుమండలంలో కలసికోవడానికి ఆ ఉత్ధానమైన వారితొపాలు మేఘాలపై ఎక్కిపోతారు. కనుక మనం సదా ప్రభువుతోనే ఉంటాం" - 1తెస్స 4,16-17.