పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ వేదవాక్యాలు ప్రభువు రెండవరాకడను దర్శనాల భాషలో వర్ణించాయి. ఇక్కడ చెప్పిన అంశాలన్నిటినీ రచయితలు వర్ణించిన వాటిని వర్ణించినట్లుగా మనం స్వీకరించనక్కరలేదు. ఉదాహరణకు ప్రభువు మేఘాలమిూద దిగిరావడం, దేవదూతలు బాకా వూది ప్రజలందరినీ ప్రోగుజేయడం, చనిపోయినవారు మేఘాలనెక్కి దేవుని దగ్గరికి రావడం మొదలైన అంశాలు దర్శనశైలికి సంబంధించినవి. వీటిని మనం గ్రహించనక్కరలేదు. ప్రభువు నరులకు తీర్పు జెప్పడానికి రెండవసారి వేంచేసినవస్తాడనేది ఈ వాక్యాల్లోని ముఖ్యాంశం. మనం ఈ సత్యాన్ని స్వీకరిస్తే చాలు.

2. తిరుసభలోనుండే ప్రభువు దర్శనమిస్తాడు

మనం మామూలుగా క్రీస్తు లోకాంతంలో మోక్షంపెద్దది దిగివస్తాడు అనుకొంటాం. నూత్న వేదవాక్యాలుకూడ ఈ బ్రాంతిని పుట్టిస్తాయి, కాని యథార్థంగా ప్రభువు యుగాంతంలో ఎక్కడో ఆకాశంనుండి దిగిరాడు. అతడు ఇదివరకే తిరుసభలో నెలకొని ఉన్నాడు. అతడే యిప్పుడు మనకు దర్శనమిస్తాడు. కనుక అతడెక్కడో బయటినుండి రాడు. తిరుసభలోనుండే మనకు దర్శనమిస్తాడు. పైగా మనం "రెండవరాకడ” అంటాం. అసలిక్కడ "రాకడ” అనేది లేనేలేదు. ప్రభువు మనకు కన్పిస్తాడు, అంతే కనుక క్రీస్తు మళ్ళా రెండవసారి వేంచేస్తాడు అని చెప్పడం కంటె, అతడు మళ్ళా రెండవసారి తిరుసభలోనుండి మనకు దర్శనమిస్తాడు అని చెప్పడం మెరుగు. కాని మన మనుష్యభాషలో, మనకు సులభంగా అర్థంకావడంకోసం, అతడు రెండవసారి వేంచేస్తాడని చెప్పకొంటాం.

ప్రభువు ఉత్తానమైనంక తిరుసభను వదలిపెట్టలేదు. నిరంతరమూ దానిలోనే వసిస్తూంటాడు. కనుకనే మత్తయి సువార్తలో అతడు "లోకాంతంవరకు సదా నేను విూతో వుంటాను" అని పల్కాడు- 28,20. అనగా అతడు నిరంతరమూ తిరుసభలో వసిస్తూంటాడు. మోక్షారోహణానంతరం క్రీస్తు దశ మారుతుందేకాని తావు మారదు. కనుక అతడు పూర్వమెక్కడున్నాడో అక్కడే ఉంటాడు. మోక్షారోహణానంతరం అతడు నరుల కంటికి కన్పించడు. ఐనా అతడు నరలోకాన్ని వీడిపోలేదు. తిరుసభను వదలిపోలేదు. ప్రేమ, భక్తి విశ్వాసాలతో తన దగ్గరికి వచ్చే భక్తులకు క్రీస్తు తిరుసభలోనుండి నిరంతరం దర్శనమిస్తూనే ఉంటాడు.